ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. అభ్యర్థులంతా యాక్టివ్ అయిపోతారు. అయితే అభ్యర్థులందు కొందరు అభ్యర్థులు మాత్రం వేరుంటారు. ఎలాగోలా జనాల నుంచి ఓట్లు రాబట్టుకోవడమే అజెండా. దీనికోసం వినూత్న ప్రయోగాలు చేస్తుంటారు. ఎన్నో హామీలు గుప్పిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క నేత తనకు తోచిన పద్ధతిని ఓట్లు రాబట్టుకోవడం కోసం అవలంబిస్తూ ఉంటారు. తాజాగా ఓ టీడీపీ అభ్యర్థి పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు తోడు.. తను సొంతంగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తానని చెప్పి మరీ ట్విస్ట్ ఇచ్చారు. అసలా ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు? ఆయన సొంతంగా అమలు పరుస్తానంటున్న ఆరు గ్యారెంటీలేంటి? అనే దానిపై ఓ లుక్కేద్దాం.
ఆ అభ్యర్థి మరెవరో కాదు.. కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్. కర్నూలు నియోజకవర్గం మొత్తం తిరిగి అభివృద్ధి కోసం చేయాల్సిన ఆరు ముఖ్యమైన సమస్యలను గుర్తించారు. తను ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే అవి చేస్తానని హామీ ఇస్తున్నారు. టీడీపీ సూపర్ సిక్స్ తో పాటు..తన సొంత సిక్స్ పాయింట్స్ అమలు పరుస్తానని చెబుతున్నారు. వీటికి జనాల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఏమో తెలియదు కానీ ఆయనైతే విస్తృతంగా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో చర్చించిన మీదట ఈ సూపర్ సిక్స్‌ను తయారు చేసినట్టుగా టీజీ భరత్ చెబుతున్నారు. సూపర్ సిక్స్ సక్సెస్ అయ్యిందంటే మాత్రం ఆయన బంపర్ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని జనం అంటున్నారు.
టీజీ భరత్ ఆరు గ్యారెంటీలు...
1. రియల్ స్మార్ట్ సిటీగా కర్నూలును చేస్తాను..
2. కొత్త పరిశ్రమలు తీసుకురావడం..యువతకు ఉపాధి.
3. మహిళలకు భద్రత ఆర్థిక భరోసా నా బాధ్యత..
4. ప్రతి ఇంటికీ సంక్షేమం..
5. అందరికీ ఆరోగ్యం..అందులో కర్నూలు ముందుండాలి
6..కర్నూలుకు హైకోర్ట్ బెంచ్ నా బాధ్యత..