హతవిధీ.. ఏమిటి బీఆర్ఎస్ పరిస్థితి. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలంటే ఇదేనేమో. ఉద్యమ సమయంలో మన కళ్ల ముందు పుట్టిన పార్టీ.. ఉద్యమాల మాటున ఓ రేంజ్‌లో కళ్ల ముందే ఎదిగిన పార్టీ.. దశాబ్ద కాలం పాటు తెలంగాణను ఏకఛత్రాదిపత్యంగా ఏలిన పార్టీ.. ఇలా కొంతకాలానికే కళ్ల ముందే కుప్పకూలడం చూస్తున్నాం. రెండో స్థానం అంటే ఓకే.. మరీ మూడో స్థానానికి పడిపోవడమేంటి? విచిత్రం కాకపోతేనూ. మాకు అడ్డూ అదుపు లేరంటూ తిరిగిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కంటికి కనిపించడమే మానేశారు. ఏదో ఒక సభలో అలా మెరిశారంతే.. అదేమంటే అనారోగ్యమంటారు. ఇప్పుడేమీ మూటలు.. ముల్లెలు ఎత్తమనడం లేదుగా.. కనీసం ఆయన కనిపించినా చాలు.. బీఆర్ఎస్ కేడర్‌లో ఉత్సాహం వస్తుంది.
బీఆర్ఎస్‌ని వీడి బీజేపీలో చేరిన సిట్టింగ్ ఎంపీలు..
కానీ కేసీఆర్ కనిపించడమే మానేశారుగా.. ఆయన భాషలోనే చెప్పాలంటే.. పొట్టోడిని పొడుగోడు కొడితే.. పొడుగోడిని పోశమ్మ కొట్టిందట. టీడీపీని ఆయన దెబ్బకొడితే.. ఆయనను కాంగ్రెస్ పార్టీ దెబ్బకొట్టింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల వరకూ రెండో స్థానంలో ఉన్న బీఆర్ఎస్‌ను సార్వత్రిక ఎన్నికల నాటికి మరింత వెనక్కి నెట్టేసి బీజేపీ వచ్చి ఆ స్థానంలో చేరిపోయింది. చివరకు ఆ పార్టీని అలా కూడా ఉండనివ్వలేదు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ తరుఫున ముందుకొచ్చే నేతలే లేకుండా పోయారట. ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్‌ని వీడి బీజేపీలో చేరిపోయారు. ఇద్దరు చేరడమంటే మాటలు కాదు. ఇక ఇదే బాటలోఇంకెంత మంది ఉంటారో కూడా తెలియని పరిస్థితి. ఈ లెక్కన వారు బీఆర్ఎస్ కంటే బీజేపీ పొజిషన్ స్ట్రాంగ్ ఉందని భావిస్తున్నట్టే కదా.
ఖర్మ కాలి వచ్చారో..
దేవుడి స్క్రిప్ట్ అలా ఉంటే ఏమీ చేయలేము. యాగం చేసినా కేసీఆర్‌కు ఈసారి కలిసిరాలేదు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటలేదో పరిస్థితి వామపక్షాల స్థాయికి దిగజారినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఏం చేసినా సరే.. బూమరాంగ్ అయ్యి తిరిగి బీఆర్ఎస్ మెడకే చుట్టుకుంటున్నాయి. ఇప్పటికే మున్సిపాలిటీలన్నీ వరుసబెట్టి కాంగ్రెస్ ఖాతాలో చేరుతున్నాయి. ఇప్పుడు లోక్‌సభ సీట్లను కనీసం పదైనా దక్కించుకోలేదో పరిస్థితి మరింత దిగజారుతుంది. అయితే పది కాదు కదా.. రెండు అయినా గెలుచుకుంటుందా? అనేది డౌటానుమానం. ఇది చాలదన్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సవాళ్లేసి మరీ సీఎం రేవంత్ రెడ్డిని మల్కాజ్‌గిరిలో పోటీకి రమ్మని పిలుస్తున్నారు. ఖర్మ కాలి వచ్చారో.. ఉన్నది.. ఉంచుకున్నది రెండూ పోతాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.