సాయిరెడ్డిని జగన్ బలిపశువును చేస్తున్నారా?
ప్రస్తుతం నెల్లూరులో వైసీపీ పరిస్థితి ఎలా ఉందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత ఎన్నికల సమయంలో మూడు పువ్వులు.. ఆరు కాయలుగా ఉన్న వ్యవహారం.. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడారు. ఇక నేతలు పార్టీని వీడితే వారి అనుచరులు ఉంటారా? మీవెంటే మేమని చల్లగా గట్టు దాటేశారు. అలాంటి నెల్లూరుకు దిక్కూ దివాణంగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్‌కి ఎంపీ టికెట్ ఇస్తామని నిన్న మొన్నటి వరకూ వైసీపీ అధినేత, సీఎం జగన్ నమ్మించారు. ఇప్పుడు ఆయనని తప్పించేసి ఆ స్థానంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేరును ప్రకటించి షాక్ ఇచ్చారు.
ఛీకొట్టి మరీ పార్టీని వీడారు..
గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. ఈ జిల్లా పార్టీకి కంచుకోటలా ఉండేది. ఆ తరువాతి పరిణామాలతో కోటకు బీటలు వారాయి. అక్కడ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులెవరైనా దొరుకుతారా? అని వెదుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీని వీడారు. ప్రస్తుతం ఆయన స్థానంలో నెల్లూరు ఎంపీ అయిన ఆదాల ప్రభాకర్‌రెడ్డితో అసెంబ్లీకి పోటీ చేయిస్తుంది. ఈ క్రమంలోనే ఎంపీ సీటును రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇవ్వాలని అధిష్టానం భావించింది. అది కూడా కుదరలేదు. ఆయన ఛీకొట్టి మరీ పార్టీని వీడారు. ఇక ఏం చేయాలో పాలు పోని పరిస్థితుల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందుతుడు శరత్ చంద్రారెడ్డికి టికెట్ ఇవ్వాలని జగన్ భావించారు.
విజయసాయిరెడ్డి నియామకం ఎందుకు జరిగింది?
ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితుడిని తీసుకొచ్చి నిలబెడితే ఓట్ల సంగతి దేవుడెరుగు.. అసలుకే ఎసరొస్తుందని పార్టీలో ఎవరైనా సలహాలిచ్చారేమో.. ఆ నిర్ణయాన్ని విరమించుుకుంది. చివరకు బీభత్సంగా సమాలోచనలు చేసి విజయసాయిరెడ్డిని రంగంలోకి దింపాలని డిసైడ్ అయ్యారు జగన్. ఇప్పుడు ఇది సరికొత్త చర్చకు దారి తీసింది. విజయసాయిరెడ్డి నియామకం ఎందుకు జరిగింది? ఎలాగూ నెల్లూరులోవైసీపీ గెలవదని డిసైడ్ అయిపోయి ఆయనను బలిపశువును చేయాలనుకున్నారా? అనే చర్చ అయితే సర్వత్రా నడుస్తోంది. నిజానికి విజయసాయిరెడ్డిది నెల్లూరే. కానీ అవతల ఉన్నది వీపీఆర్. ఆర్థిక బలం, అంగబలం గట్టిగా ఉన్న కేండిడేట్. విజయసాయిరెడ్డికి అర్థ బలం లేదని కాదు కానీ వీపీఆర్ స్థాయి అయితే కాదు. మరి ఆయన్ను తట్టుకుని నిలబడటం అయితే విజయసాయిరెడ్డికి కష్టమే. నిలబడితే మాత్రం విజయసాయిరెడ్డి దశ తిరిగినట్టే.