ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శత్రువులు ఎక్కడో లేరు. ఇంట్లో, ఆయన చుట్టూనే ఉన్నారు. ఇద్దరు చెల్లెళ్లు చేరి.. జగన్‌వి హత్యా రాజకీయాలని.. అటువంటి వాటిని ఎంకరేజ్ చేయవద్దని ఊదరగొడుతున్నారు. ఇది చాలదన్నట్టుగా ఇప్పుడు జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు దస్తగిరి ఈసారి ఏకంగా సీఎంపైనే పోటీ చేస్తున్నట్టు ప్రకటించాడు. వివేకా కేసులో అప్రూవర్‌గా మారిన నాటి నుంచి దస్తగిరి ఏదో ఒక సంచలనానికి తెరదీస్తూనే ఉన్నాడు. తనను హతమార్చేందుకు కుట్ర జరుగుతోందంటూ ఇటీవలే ఆరోపించాడు.
జగన్‌కు చుక్కలే..
ఇక తాజాగా దస్తగిరి జై భీమ్ పార్టీలో చేరాడు.వచ్చే ఎన్నికలలో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించి హాట్ టాపిక్ అయిపోయాడు. దస్తగిరి పోటీ అంటేనే జగన్‌కు చుక్కలు కనిపించడం ఖాయం. ప్రచారంలో దస్తగిరి ఏమేం మాట్లాడతాడో.. ఏయే విషయాలు చెబుతాడో అని జగన్ అండ్ కోకు ఇప్పటి నుంచే నిద్ర పట్టదేమో. అతడిని పోటీ చేయకుండా అడ్డుకునేందుకు ఇప్పటికే ట్రయల్స్ ప్రారంభమయ్యే ఉంటాయి. ఇప్పటి వరకూ వివేకాను హత్య చేసింది ఎవరో చెప్పి జగన్ ఎన్నికలకు వెళ్లాలని పదేపదే అంటున్న దస్తగిరి.. ఇప్పుడు ఏకంగా జగన్ మీద పోటీ అని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. జైలు నుంచి విడుదలైన నాటి నుంచే దస్తగిరి కడప జిల్లాలో అలజడికి కారణమయ్యాడు. తనకు తెలంగాణ పోలీసులలతో భద్రత కావాలంటూ కోర్టును ఆశ్రయించనున్నాడు.
ఈ మధ్యే బెయిల్‌పై విడుదల..
ఇప్పటికే దస్తగిరి ఓ అమ్మాయిని కులం పేరుతో దూషించాడని.. అంతేకాకుండా కిడ్నాప్ సైతం చేయబోయాడంటూ దస్తగిరిపై ఎర్రగుంట పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ మధ్యే అతను బెయిల్ మీద విడుదలయ్యాడు. కారు డ్రైవర్‌గా వైఎస్ వివేకాకు దగ్గరయ్యాడు. వివేకా ఇంటి వ్యవహారాలన్నీ అతనే చూసుకునేవాడు. ఆ తరువాత వివేకా హత్యోదంతంలోనూ కీలకంగా మారాడు. ఇక ఆ తరువాత అప్రూవర్‌గా మారాడు. తనను రాజకీయాలను అడ్డుపెట్టుకుని ఇబ్బంది పెడుతున్న వారికి తాను కూడా రాజకీయాల్లోకి వచ్చి చుక్కలు చూపిస్తానని దస్తగిరి అంటున్నాడు. దీంతో తన నేటివ్ ప్లేస్ అయిన పులివెందుల నుంచి పోటీ చేయనున్నానని ప్రకటించాడు.