కాదేదీ ఫేక్ ప్రచారానికి అనర్హం.. అన్నట్టుగా వైసీపీ వ్యవహరిస్తోంది. టీడీపీ, జనసేనలపై ఎంతటి దుష్ఫ్రచారానికైనా వెనుకాడటం లేదు. ఏకకాలంలో అటు టీడీపీ, ఇటు జనసేనలను టార్గెట్ చేస్తోంది. టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్‌పై ఏకంగా ఓ ఫేక్ వీడియోను వైరల్ చేస్తూ.. దానికి పిచ్చి రాతలతో పోస్టులు పెడుతోంది. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ లెటర్ ప్యాడ్‌పై.. ఆయన సంతకాన్ని మాత్రం ఉంచేసి మ్యాటర్ అంతా మార్చేసింది. మొత్తానికి మోసంతో ఎన్నికల్లో నెగ్గుకు వచ్చేందుకు స్కెచ్ గీస్తోంది. టీడీపీ, జనసేన పొత్తుతో తాడేపల్లి ప్యాలెస్ షేక్ అయిపోయింది. దీంతో పొత్తును విడదీయాలనే నానా విధాలుగా ట్రై చేసింది.అది జరగలేదు. ఇక పొత్తును పక్కనబెట్టి కేడర్‌లో పార్టీపై వ్యతిరేకత తీసుకొచ్చేందుకు ట్రై చేస్తోంది.
పొత్తుపై ప్రభావం చూపిస్తున్న లేఖలు..
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు వద్ద జరిగిన భారీ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఈ ప్రసంగం తర్వాత వైసీపీ సోషల్ మీడియా రెచ్చిపోయింది. పవన్ రాసినట్టుగా ఓ లేఖను క్రియేట్ చేసి ప్రచారం ప్రారంభించింది. సభ పవన్ పేరిట ఓ లేఖను తెగ వైరల్ చేస్తోంది. పవన్ వ్యాఖ్యలను పూర్తిగా మార్చేసి మరీ ప్రచారం ప్రారంభించింది. తనకు ఎవరి సలహాలు అక్కరలేదని.. ఇటీవల సలహాలు ఇస్తూ బహిరంగ లేఖలు రాస్తున్నారని పవన్ పరోక్షంగా హరిరామ జోగయ్యనుద్దేశించి పవన్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. కొందరు సీనియర్ల లేఖలు పొత్తుపై ప్రభావం చూపుతున్నాయన్నారు. ఒంటరిగా పోటీ చేసే శక్తి ఇప్పటికిప్పుడు జనసేనకు లేదని.. తనపై విమర్శలు చేసే వారు ముందుగా దీనిపై ఆలోచించాలని కోరారు.
అధినేత ఎవరైనా అలా అంటారా?
ఇందులో తప్పేమీ లేదు. పార్టీ అధినేతకు ఏం చేయాలి? ఏం చేయకూడదన్న ఆలోచన ఉంటుంది. పార్టీ నేతలే సీట్లు, అధికారం గురించి అంత ఆలోచనే చేస్తే అధినేత చేయరా? పవన్ వ్యాఖ్యలను పూర్తిగా మార్చేసి ‘24 సీట్లతో ఏకీభవించండి.. లేదంటే వైసీపీకి వెళ్లిపోండి’ అన్న టైటిల్‌తో ఆయన పేరిట లెటర్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పొత్తు ధర్మం పాటించని కార్యకర్తలు జనసేనకు అవసరం లేదని.. జెండాలు మోయడం బరువైతే అధికార పార్టీలోకి వెళ్లిపోవాలంటూ లెటర్‌లో పవన్ పేర్కొన్నట్టుగా చెబుతున్నారు. అసలు అధినేత ఎవరైనా అలా అంటారా? కొంచెమైనా విలువల్లేని రాజకీయం వైసీపీ చేస్తోంది. మరీ ఇంత దిగజారుడుతనమైతే ఎలా? ఇక పవన్ సంగతి ఇలా ఉంటే టీడీపీని మరోలా బ్లేమ్ చేస్తు్న్నారు.
వైఎస్ జగన్‌ను ఎదుర్కొంటారా?
టీడీపీ అధినేత చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశపెట్టారు. 18ఏళ్లు దాటిన ప్రతి మహిళకు ప్రతినెలా ఖాతాలో రూ.15 వందలు.. ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్‌సిలిండర్లు.. మహిళలకు ఆర్టీసీ బస్సులోఉచిత ప్రయాణం... అమ్మకు వందనం పథకం ద్వారా ఇంట్లో చదివే పిల్లలందరికీ ఒక్కొక్కరికి రూ.15వేలు లబ్ధి.. ఇక రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.20వేలు అందిస్తామని టీడీపీ చెబుతోంది. ఈ సూపర్ సిక్స్‌ను సైతం మార్చేసి ఓ పెట్టెలో మందు బాటిల్, సిగిరెట్స్, కండోమ్ వంటి ఆరు రకాల ఐటెమ్స్ పెట్టి వైసీపీ ఓ వీడియోను వైరల్ చేస్తోంది. దీనికి ఓ పోస్ట్ కూడా పెట్టింది. ఆ పోస్ట్ ఏంటంటే.. ‘‘మందూ, సిగరెట్లు, డబ్బులూ ఇస్తే తప్ప క్యాడర్ మీ సభలకు రావడం లేదు. అవన్నీ ఇచ్చి బతిమాలి తెచ్చుకున్న కూలి జనంతో రాజకీయం చేసే మీరు ఒంటి చేత్తో పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సీఎం వైఎస్ జగన్‌ను ఎదుర్కొంటారా? ఇక మీ పని అయిపోయింది, మీ కుర్చీలు మడతబెట్టి ఇళ్లకు పోండి’’ అని పోస్ట్ పెట్టారు. మొత్తానికి అటు వైసీపీ, ఇటు టీడీపీలపై అసత్య ప్రచారానికి జగన్ సైన్యం పూనుకుంది.