జనసేన, టీడీపీలు సీట్ల సంఖ్యను తేల్చినప్పటి నుంచి జనసేనలో బీభత్సమైన రచ్చ జరుగుతోంది. ఈ రచ్చ చేసేదంతా ముఖ్యంగా శ్రేయోభిలాషేలే అనడంలో సందేహం లేదు. మరి ఈ శ్రేయోభిలాషులంతా గత ఎన్నికల్లో ఏమైపోయారు? ప్రత్యర్థి మీడియా సంస్థకు వెళ్లి అక్కడ డిబేట్స్‌లో పార్టిసిపేట్ చేసి రచ్చ చేసే వాళ్లు శ్రేయోభిలాషులెలా అవుతారు? అలాంటి శ్రేయోభిలాషులను నమ్ముకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీ దక్కించుకున్న సీట్లను అయినా ఎలా గెలిపించుకోగలుగుతారు? ప్రత్యర్థి పార్టీల వాళ్లు రెచ్చగొడుతున్నారు.. వీళ్లు రెచ్చిపోతున్నారు. పోనీ సాధించేదేమైనా ఉందా? అంటే శూన్యం.
పార్టీ గెలుపు కోసం ఏమైనా కృషి చేస్తారా?
పోనీ రెచ్చిపోతే రెచ్చిపోయారు.. జనసేన ఏపీలోని అన్ని ప్రాంతాల్లోనూ పోటీ చేస్తుంది.. గెలిపించే సత్తా వీరికి ఉందా? పోనీ అన్ని ప్రాంతాల్లో ఖర్చులకు డబ్బేమైనా సర్ధుతారా? అదీ కాదంటే తెగ రెచ్చిపోయే నేత ఎవరైనా సరే తమ నియోజకవర్గంలో బీభత్సంగా పర్యటించేసి పార్టీ గెలుపు కోసం ఏమైనా కృషి చేస్తారా? పక్కాగా పార్టీ అభ్యర్థిని గెలిపించి తీరుతామనే భరోసా ఇస్తారా? ఏమీ చేయలేరు. ఒక క్రమశిక్షణ లేదు.. పాడూ లేదు. ఇష్టానుసారంగా నోటికి ఏది వస్తే దానిని ప్రత్యర్థి మీడియాకెళ్లి మాట్లాడటం.. పార్టీని ఇరుకునబెట్టడం. ఇలాంటి వారి కారణంటా పైసా ప్రయోజనం ఉంటుందా? పక్కాగా ఉంటుంది. సొంత పార్టీకి కాదు.. ప్రత్యర్థి పార్టీకి.
రాబట్టుకున్న సీట్లన్నీ గెలుచుకుంటే..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇలాంటి వారి విషయంలో వీలైనంత త్వరగా క్రమశిక్షణ చర్యలు చేపడితే బెటర్. జనసేనకు ప్రజలే అండ కానీ ఇలాంటి నేతలు ఎంత మాత్రమూ కాదు. గత ఎన్నికల్లో ఒక్క సీటు మినహా కనీసం అధినేత పవన్ కల్యాణ్‌ను కూడా గెలిపించుకోలేకపోయారు. అలాంటి వారు ఇప్పుడు సీట్లు తక్కువయ్యాయని గొడవ పెడుతున్నారు. ఇదంతా వైసీపీకి పండుగలా అనిపిస్తోంది. మరింత రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకుంది. జనసేన నేతల మధ్య అగ్గి రాజేసి చలి కాచుకుందామనుకుంటోంది. దీనికి ఆస్కారమిస్తున్నది స్వయానా జనసేన నేతలే. ఈసారి పొందిన సీట్లన్నీ గెలిపించుకుని నెక్ట్స్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తే సరిపోతుంది కానీ రచ్చ చేసి పార్టీని పాతాళానికి నెట్టేయకూడదు.