ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏవేవో కొత్త సమీకరణాలు వెలుగు చూస్తున్నాయి. ఏ పార్టీకి ఎవరు ప్లస్, మైనస్ అనే చర్చ బీభత్సంగా జరుగుతోంది. వైసీపీకి అయితే ప్లస్‌లు, మైనస్‌లు ఎవరనేది జనాలకు బాగానే తెలుసు. ఇక టీడీపీ విషయానికి వస్తే ఈసారి జనసేనతో పొత్తు పెట్టుకుంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేతల జోడి 2014లో సూపర్ హిట్ అయ్యింది. అయితే అప్పటికీ ఇప్పటికీ కొంత తేడా ఉంది. ఆ సమయంలో జనసేన పోటీ చేయలేదు. కేవలం టీడీపీకి మద్దతుగా నిలిచింది. కాబట్టి సమస్యే లేదు. సీట్ల గోల లేదు. ఈసారి మాత్రం సీట్ల గోల తప్పేలా లేదు. ఎన్ని సీట్లు జనసేనకు ఇస్తే.. అంత మంది టీడీపీ నేతలకు అధినేత చంద్రబాబు నచ్చజెప్పుకోవాలి.
ఓడిపోయే అవకాశాలు చాలా తక్కువ..
ఈ తరుణంలో చంద్రబాబుకు పవన్ ప్లస్ అవుతున్నారా? లేదంటే మైనస్ అవుతున్నారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఒకరకంగా చూస్తే పవన్ ప్లసే. మరోరకంగా చూస్తే మైనస్. ఎలాగంటారా? జనసేనతో కలవడం వల్ల ఓట్లు చీలే సమస్య అయితే ఉండదు కాబట్టి ఓటమి ఈ రెండు పార్టీల కూటమి ఓడిపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది. ఏ పార్టీకైనా అంతిమంగా కావల్సింది ఇదే కదా. ఇక మైనస్ అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. పొత్తులో భాగంగా ఇప్పటికే 24 సీట్లు తీసుకుంది జనసేన. ఇంకెన్ని సీట్లు తీసుకుంటుందనే తెలియాల్సి ఉంది. నిజానికి గత ఎన్నికల్లో ఈ పార్టీ ఒకే ఒక్క సీటును గెలుచుకుంది. అధినేత పవన్ రెండు చోట్ల పోటీ చేసి కూడా ఓటమి పాలయ్యారు.
తిరగబడితే పార్టీ పరిస్థితేంటి?
అలాంటి పార్టీకి పదుల సంఖ్యలో సీట్లు కట్టి టీడీపీ అధినేత సొంత పార్టీలోనే ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. టీడీపీని ఎంతో కాలంగా నమ్ముకుని ఉన్న సీనియర్లకు దీని వలన నష్టం కలుగుతోంది. అది పార్టీకి మంచిది కాదు. చాలా చోట్ల టీడీపీ కేడర్ తిరగబడుతోంది. తద్వారా పార్టీకే నష్టం వాటిల్లుతోంది. టీడీపీ కేడర్‌తో పోలిస్తే జనసేన కేడర్ చాలా తక్కువ. అలాంటప్పుడు మహా సముద్రంలాంటి టీడీపీ కేడర్ తిరగబడితే పార్టీ పరిస్థితేంటి? రేపు ఎన్నికల్లో సహకరించకుంటే ఇబ్బందే కదా? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో టీడీపీ, జనసేన ఒకరికొకరి సపోర్ట్ అవసరమే కానీ ఇష్టానుసారంగా సీట్ల పంపకం టీడీపీకే చేటు తెస్తుంది. మొత్తానికి జనసేన కారణంగా చంద్రబాబు ఎన్నికల్లో గ్రాండ్ సక్సెస్ అవుతుంది. లేదంటే పొత్తు కారణంగానే చంద్రబాబు అధికారాన్ని కోల్పోతారు.