ఓరి బాబోయ్.. వైసీపీలో మళ్ళీ మొదటికి..!
మాట తప్పం.. మడమ తిప్పం అని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా సార్లు చెప్పారు. కానీ చెప్పిన ప్రతిసారీ మాట తప్పుతూనే ఉన్నారు.. మడమ తిప్పుతూనే ఉన్నారు. వైసీపీ పెద్దలకు ఇది అలవాటైపోయింది కానీ నేతలకు మాత్రం ఇంకా అలవాటు కాలేదు. ఇక్కడే వచ్చింది అసలు చిక్కంతా. మొన్నటికి మొన్న పార్టీ సమన్వయ కర్తలను నియమించింది. జగన్ అలుపన్నది లేకుండా.. విరామానికి చోటివ్వకుండా క్యాంపు కార్యాలయంలో కూర్చొని మరీ లిస్ట్ తయారు చేశారు. ఈ లిస్ట్‌తో ఆనందపడిన వాళ్లుకున్నారు. కోపగించుకుని బయటకు వెళ్లిపోయిన వారూ ఉన్నారు. ఇక లిస్ట్‌లో పేర్లున్న వారైతే ఇప్పటికే తాము ఎమ్మెల్యేలం, ఎంపీలం అయినట్టుగా ఊహించేసుకుని ప్రమాణ స్వీకారం ప్రాక్టీస్ చేస్తున్నారట.
ఏడు జాబితాల్లోనూ మార్పులు..?
తాజాగా వారందరికీ వైసీపీ అతి ముఖ్యమైన నేతల్లో ఒకరైన వైవీ సుబ్బారెడ్డి షాక్ ఇచ్చారు. వాళ్లంతా అభ్యర్థులు కారట.. కేవలం సమన్వయ కర్తలు మాత్రమేనట. చావు కబురు చల్లగా చెవినేశారు. అంతే ఒక్కసారిగా తాజాగా నియమితులైన సమన్వకర్తలందరి గుండెల్లో ఏకంగా డైనమేటే పేలినంత పనైంది. ఇప్పటి వరకూ వెలువరించిన ఏడు జాబితాలూ.. సైతం అవునా.. దీని కోసమా.. జగన్ అంతలా అలుపూ సొలుపూ లేకుండా శ్రమించిందని ముక్కున వేలేసుకుంటున్నాయి. సిట్టింగ్‌లందరినీ గెంటేసి మరీ సీటు సాధించుకున్నామని సంబరపడిపోతున్న వారి కళ్లలో ఆనందం ఆవిరై.. గుండెలు బరువెక్కాయి. ఏడు జాబితాల్లోనూ మార్పులు చేర్పులు ఉంటాయన్న సంకేతాలైతే వైవీ సుబ్బారెడ్డి ఇచ్చేశారు. సిద్ధం నాలుగో సభ పూర్తవగానే మేనిఫెస్టోతో పాటు లిస్ట్ కూడా రెడీ అవుతుందట.
ఈ ప్రకటన వెనుక లోగుట్టు ఏంటి?
వచ్చే నెల 3న జగన్ సిద్ధం సభ మేదిరిమెట్లలో జరగనుంది. ఆ సభ అయిపోయిన వెంటనే వైసీపీ అభ్యర్థుల జాబితా సిద్ధం కానుందట. ఎవరి సీటు ఉంటుందో.. ఎవరి సీటు చిరుగుతుందో తెలియక వైసీపీ నేతలంతా ఆందోళన చెందుతున్నారు. అయితే వైవీ సొంతంగా ఈ ప్రకటన చేశారా? లేదంటే జగన్ చేయించారా? అసలు ఈ ప్రకటన వెనుక లోగుట్టు ఏంటనేది? ప్రశ్నార్థకంగా మారింది. ఏ ప్రయోజనమూ లేకుండా జగన్ నాలుక మడతెట్టరు.. మడతెట్టించరు కాబట్టి అనుమానించాల్సిన విషయమే. ముందు నుంచి పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన వారిని కాదని.. ఎవరిలో అకస్మాత్తుగా తీసుకొచ్చి టికెట్ ఇవ్వడంపై చాలా మంది నేతలు గుర్రుగా ఉన్నారు. వారందరినీ మభ్యపెట్టి గట్టు దాటకుండా చూసేందుకే వైవీతో ఈ ప్రకటన జగన్ చేయించారని సమాచారం. ఇక చూడాలి ఏం జరుగుతుందో...