తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఎక్కడా కనిపించడం లేదు. ఇటీవల ఓ సభ.. ఎమ్మెల్యే లాస్య నందిత మరణంపై ఓ ట్వీట్ మినహా కేసీఆర్ ఎక్కడా కనిపించింది. 10 ఏళ్ల పాటు ఆయన తెలంగాణను ఏలారు. ఆయనలో ఆ సమయంలో ఎక్కడ లేని ధీమా కనిపించేది. తెలంగాణ అంటే బీఆర్ఎస్.. బీఆర్ఎస్ అంటే తెలంగాణ అన్నట్టుగా పరిస్థితులను మార్చేశారు. ఒకానొక సమయంలో దేశ రాజకీయాలను సైతం శాస్తిస్తారని అంతా భావించారు. కానీ కేసీఆర్‌లో ధీమా మాత్రమే ఉంటే బాగుండేది కానీ దానితో పాటే అహంభావం.. మోనార్కిజం పెరిగిపోయాయి. వెరసి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది.
మరింత కుంగదీసిన శస్త్రచికిత్స..
తమని తాము అతిగా ఊహించుకోవడంతో పాటు రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేయడం కేసీఆర్‌ను దెబ్బకొట్టింది. ఈ దెబ్బకు చాలా వరకూ కేసీఆర్ కుంగిపోయారు. మీడియా ముందుకు రాలేదు. ఆపై ఆయన జారిపడి తుంటి ఎముక విరగడం.. శస్త్ర చికిత్స మరింతగా ఆయనను కుంగదీశాయి. శాసన సభ బడ్జెట్ సమావేశాలకు సైతం కేసీఆర్ గైర్హాజరయ్యారు. సమావేశాలకు వచ్చి తమను ఎదుర్కోవాలంటూ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు పదేపదే సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నా కేసీఆర్ మాత్రం సమావేశాలకు హాజరు కాలేదు. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటకుంటే తెలంగాణలో పరిస్థితులు మరింత దిగజారతాయని భావించిన కేసీఆర్.. బీజేపీతో పొత్తు పెట్టుకుందామనుకున్నారు.
పూర్తి నైరాశ్యంలోకి కేసీఆర్..
అది కాస్తా లీక్ అవడం.. బీజేపీ పొత్తుకి సిద్ధపడకపోవడంతో పాటు ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసును తిరగదోడటం చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కేసీఆర్ పూర్తిగా నైరాశ్యంలో కూరుకుపోయినట్టు తెలుస్తోంది. ఈ తరుణంలో ఆయన లోక్‌సభ ఎన్నికలపై కూడా కాన్సన్‌ట్రేట్ చేయడం లేదని టాక్. పైగా ఒక్కొక్కరుగా బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగినా ప్రయోజనం ఉండటం లేదు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో బీఆర్ఎస్ ఉంది. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ మరింత స్ట్రాంగ్ అవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో అన్నో ఇన్నో సీట్లు గెలుచుకోగలిగితేనే బీఆర్ఎస్‌కు కాస్త పట్టు దొరికినట్టవుతుంది. లేదంటే ఇబ్బందులే..