ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల దూసుకెళుతున్నారు. పీసీసీ చీఫ్‌గా పగ్గాలు అందుకున్నాక షర్మిల.. ఏపీలో మరుగున పడిపోయిన కాంగ్రెస్ పార్టీని ఉనికిలోకి తీసుకొచ్చారనడంలో సందేహం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఏపీలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది. అసలు కాంగ్రెస్ అనే మాటే వినిపించలేదు. అలాంటిది ఇప్పుడు ఏపీ సీఎం జగన్‌పై సొంత సోదరి అయిన షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు బీభత్సంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ తిరిగి మునుపటి హోదాను ఇప్పటికిప్పుడు అయితే పొందలేకపోవచ్చు కానీ ఆమె రాక మాత్రం కచ్చితంగా ప్రభావం చూపించే అవకాశమైతే ఉంది.
తుప్పాస్ డీఎస్సీని ప్రకటించారని..
ఏపీలోకి కాంగ్రెస్ చీఫ్‌గా అడుగుపెట్టీ పెట్టగానే.. ప్రజాపోరాటాన్ని ఆరంభించారు. ప్రత్యేక హోదా అంశాన్ని ఎత్తుకున్నారు. ఇక ఇప్పుడు నిరుద్యోగ సమస్యలపై గళమెత్తారు. జగన్ ఒక తుప్పాస్ డీఎస్సీని ప్రకటించారని.. మెగా డీఎస్సీని ప్రకటించాలంటూ పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె అరెస్ట్ కూడా అయ్యారు. గడిచిన పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ నుంచి అరెస్ట్‌లనే మాటే లేదు. అసలు కాంగ్రెస్ తరుఫున పోరాటాలే లేనప్పుడు అరెస్ట్‌లు కూడా ఉండవు. ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చప్రారంభమైంది. షర్మిల అరెస్ట్ వ్యవహారంతో.. ఇప్పుడు విజయమ్మ ఆమె తరఫున రంగంలోకి దిగుతారా..? అనేది. తెలంగాణలో షర్మిల అరెస్ట్ అయితే విజయమ్మ రంగంలోకి దిగారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందా? ఒకవేళ జరిగితే జగన్ పరిస్థితి ఏంటి అనే చర్చ జరుగుతోంది.
విజయమ్మ ఇప్పుడెందుకు సైలెంట్‌గా ఉంటున్నారు?
తెలంగాణలో కూడా షర్మిల సేమ్.. నిరుద్యోగుల సమస్య మీద పాదయాత్ర చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తెలంగాణలో షర్మిలను అరెస్ట్ చేశారు. అప్పుడే విజయమ్మ రంగంలోకి దిగారు. అప్పట్లో అంత హడావుడి చేసిన విజయమ్మ ఇప్పుడెందుకు సైలెంట్‌గా ఉంటున్నారు? అవతల ఉన్నది కొడుకునా? మరి అదే కొడుకు ఇంటి నుంచి తరిమేశాడు కదా? పైగా మేనల్లుడి వివాహానికి సైతం హాజరు కాలేదు. అలాంటి కొడుకు కోసం విజయమ్మ బయటకు రావడం లేదా? అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అవతల జగన్ సైన్యమంతా షర్మిలను ఒంటరిని చేసి విమర్శలు గుప్పిస్తుంటే విజయమ్మ సైలెంట్‌గా ఎలా ఉండిపోతారని కాంగ్రెస్ నేతలు పలువురు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే వరకూ రాజకీయాలు మారిపోతాయా? అని ప్రశ్నిస్తున్నారు.