టీడీపీకి కష్ట సమయంలో అండగా నిలిచి పొత్తుకు సైతం సిద్ధపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆ తరువాత ఉమ్మడి కార్యాచరణ, మేనిఫెస్టో, సీట్ల పంపకం తదితర పనులను రెండు పార్టీల అధినేతలు కలిసి చూసుకుంటూ వచ్చారు. అసలు పొత్తు అన్నప్పుడే ఈ పార్టీల విజయం దాదాపు ఫిక్స్ అయిపోయింది. అలాగే ముందుకు వెళితే బాగుండేది. మధ్యలో బీజేపీని కలుపుకుందాం అనుకోవడంతో అసలు చిక్కంతా వచ్చి పడింది. ఏపీలో ఏమాత్రం ప్రాధాన్యత లేని పార్టీకి అత్యంత ప్రాధాన్యతనిచ్చి అటు చంద్రబాబు.. ఇటు పవన్ కల్యాణ్.. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో చర్చల మీద చర్చలు జరిపారు.
తుది నిర్ణయానికి రాలేకపోతున్నారా?
అయితే చర్చలు ఏమైనా కొలిక్కి వచ్చాయా? అంటే రాలేదు. బీజేపీ ఎందుకో కానీ తెగనివ్వడం లేదు.. ముడిపడనివ్వడమూ లేదు. ఎప్పటికప్పుడు క్లైమాక్స్ లాగానే అనిపిస్తోంది కానీ అంతులేని కథ సినిమా మాదిరిగా తయారవుతోంది. బీజేపీ ఎటూ తేల్చకపోవడంతో టీడీపీ – జనసేనలు తమ పార్టీ తరుపున పోటీ చేయబోయే అభ్యర్థుల విషయంలో కానీ, పోటీ చేసే స్థానాల విషయంలో కానీ ఒక తుది నిర్ణయానికి రాలేకపోతున్నారు. దీంతో ఇరు పార్టీల నేతలు కూడా తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఇలా నాన్చడం వలన బీజేపీకి కలిగే నష్టమైతే ఇసుమంత కూడా ఉండదు కానీ టీడీపీ, జనసేనలకు మాత్రం తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
ఏం చూసుకుని ఇంతటి అరాచకం?
అటు చంద్రబాబు ఢిల్లీ నుంచి ఫ్లైట్ ఎక్కగానే.. ఇటు గన్నవరం నుంచి ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కారు. దీనికి రకరకాల కారణాలు చెప్పారులెండి. అయితే లోగుట్టు వేరకొటి ఉంటుందని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. ఇక హస్తినకు వెళ్లిన జగన్.. బీజేపీ అధిష్టానానికి ఏం చెప్పారో.. లేదంటే ఏమైనా ఆఫర్ ఇచ్చారో ఏమో కానీ రాష్ట్రంలో జగన్ చెలరేగిపోతున్నారు. ప్రతిపక్షాలనే కాకుండా మీడియాపై కూడా దాడులకు సిద్ధం అంటున్నారు. మరి జగన్ ఏం చూసుకుని ఇంతటి అరాచకానికి పాల్పుడుతున్నారా? అనే సందేహాలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. జగన్ అయితే దాదాపు అభ్యర్థుల లిస్ట్ ఫిక్స్ చేసి ఎన్నికల ప్రచార బరిలోకి దిగుతున్నారు. టీడీపీ, జనసేనలు బీజేపీ నుంచి ప్రకటన ఎప్పుడొస్తుందా? అని చూస్తున్నాయి. చివరకు బీజేపీ ‘ఐ యామ్ వెరీ సారీ’ అంటే పరిస్థితేంటో ఆలోచించుకోవాలి.