రేవంత్ రూ.6 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారు.. మరి జగన్?
అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తా ఉంది అంటూ బారెడు దీర్ఘం తీసి చెప్పే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడుందో చూపించమంటే మళ్లీ నోరెత్తలేరు. ప్రభుత్వం మారినప్పుడల్లా విధానాలను మార్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక.. గత ప్రభుత్వ పాలకుల విధానాలను పాటించాల్సిన అవసరం లేదనుకున్నారు. ఇదే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అభివృద్ధి విషయంలో అవసమనుకున్న కొన్ని మార్పులు మినహా పెద్దగా విధానాల్లో మార్పేమీ చేయకుండా కొనసాగుతున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన కొద్ది రోజులకే రాష్ట్రానికి పెట్టుబడులు భారీగానే వచ్చాయి.
కేసీఆర్ కష్టాన్ని వృథా పోనివ్వని రేవంత్..
ముఖ్యమంత్రి పదవి చేపట్టిన 15 రోజులకే సీఎం రేవంత్ రెడ్డి తన బృందంతో కలిసి దావోస్ ఆర్ధిక సదస్సుకు వెళ్ళారు. అక్కడ ఆయన వ్యవహరించిన తీరు అద్భుతం. ఈక్రమంలోనే రాష్ట్రానికి సుమారు 30-40 వేల కోట్లు పెట్టుబడులు సాధించుకున్నారు. ఈ క్రమంలోనే గత ప్రభుత్వం హయాంలో పెట్టుబడిరులతో కుదుర్చుకున్న ఒప్పందాలను సైతం గౌరవిస్తున్నారు. దీంతో పారిశ్రామిక వాణిజ్య అభివృద్ధి ఏమాత్రం కుంటుపడకుండా సాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్.. రెన్యూసిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. నిజానికి ఈ డీల్ కోసం కేసీఆర్ ప్రభుత్వం చాలా కష్టపడింది. ఆ కష్టాన్ని వృథా కానివ్వకుండా రేవంత్.. ఆ సంస్థను రాష్ట్రానికి ఆహ్వానించి తిరిగి డీల్ చేసుకున్నారు.
ఏపీలో ఏం తెచ్చారని అడిగితే..
ఇక రెన్యూసిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసి తెలంగాణలో రూ.6 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ భారీ పెట్టుబడితో దక్షిణాది రాష్ట్రాలలోనే అతిపెద్ద సోలార్ పీవీ మాడ్యూల్స్, పీవీ సెల్స్ తయారుచేసే పరిశ్రమని ఏర్పాటు చేయబోతోంది. నిజానికి మూడు నెలలు కాని ప్రభుత్వం రూ.6 వేల కోట్లు పెట్టుబడులు తెచ్చింది. అదే ఏపీలో ఏం తెచ్చారని అడిగితే.. మసాలా పొడులు వంటి చిన్న చిన్న ఎంఓయూల చిట్టా విప్పుతారు మన కోడి మంత్రిగారు. మొత్తం కలిపినా తిప్పి కొడితే రూ.కోటి ఉండవు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి దాదాపు ఐదేళ్లవుతున్నా పోయే పరిశ్రమలే కానీ వచ్చే పరిశ్రమలు కనిపించలేదు. అమర్ రాజా బ్యాటరీస్, లూలూ గ్రూప్ వంటి అనేక సంస్థలు ఏపీని వీడాయి. పైగా నోరు తెరిస్తే సీఎం జగన్ అభివృద్ధి మంత్రం జపిస్తూ ఉంటారు. మరి ఆయన దృష్టిలో సంక్షేమ పథకాలను అమలు చేయడమే అభివృద్ధి అనుకుంటా.