జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఐదేళ్లవుతోంది. ఇప్పటి వరకూ ఆయన ఏం చేశారో ఆయనకే తెలియాలి. వచ్చింది మొదలు.. ప్రజావేదిక కూల్చివేతతో అధికారాన్ని ప్రారంభించారు. ఇక అక్కడి నుంచి మొదలు.. కూల్చివేతలు తప్ప నిలబెట్టడాలు లేవు. రాజధానిగా ఉన్న అమరావతిని నిలువునా ముంచేసి మూడు రాజధానుల పాటందుకున్నారు. పోనీ అదేమైనా చేశారా? అంటే అదీ లేదు. మూడు రాజధానులతో పాటు ప్రజలను త్రిశంకు స్వర్గంలో ఊగించారు. ఎక్కడ సభ జరిగినా అభివృద్ధి అనే మాటను ఒక తారకమంత్రంలా ఉపయోగిస్తారు. కానీ చేసిందేమైనా ఉందా? ఏమీ లేదు. వచ్చిన పరిశ్రమలను సైతం ఏపీ నుంచి వెళ్లగొట్టేశారు.
వైజాగ్‌లో అయినా ఏర్పాటు చేయవచ్చు కదా?
ఇంతటి మేధావి తాజాగా రిజర్వ్ బ్యాంక్ కార్యాలయం గురించి ఆలోచన చేస్తున్నారు. నిజానికి రిజర్వ్ బ్యాంకు కార్యాలయం, సిబ్బంది నివాసాల కోసం గత టీడీపీ ప్రభుత్వం అమరావతిలో 11 ఎకరాలు కేటాయించింది. కానీ దానిని కొనసాగిస్తే క్రెడిట్ అంతా చంద్రబాబుకు వెళుతుంది పైగా అమరావతినే వద్దనుకున్న జగన్.. రిజర్వ్ బ్యాంకు అమరావతిలో ఏర్పాటు చేయడానికి అంగీకరిస్తారా? సాధ్యమయ్యే పనే కాదు. పోనీ అమరావతిలో వద్దనుకున్నారు.. తాను కోరుకున్న వైజాగ్‌లో అయినా ఏర్పాటు చేయవచ్చు కదా? అక్కడా చేయలేదు. ఎప్పటి నుంచో విశాఖ పరిపాలన రాజధాని అంటూ చెబుతూ వస్తున్న జగన్.. అక్కడ రిజర్వ్ బ్యాంకు కార్యాలయం సహా ఇతర సంస్థలను సైతం ఏర్పాటు చేసి ఉంటే.. రాజధాని పట్ల ఆయనకు చిత్తశుద్ది ఉందని జనం నమ్మేవారు.
నెలలో నోటిఫికేకషన్ వస్తుందనగా..
విశాఖను రాజధాని చేయాలంటే న్యాయస్థానాలు అవరోధం కల్పిస్తాయేమో కానీ రిజర్వ్ బ్యాంక్, నాబార్డ్ వంటి సంస్థలకైతే కల్పించవు కదా. ఇప్పుడు అంటే మరో నెలలో నోటిఫికేకషన్ వస్తుందనగా.. ఇలా చేయడమేంటి? అంటే చిన్న పిల్లాడికి కూడా అర్ధమవుతుంది.. ఎలక్షన్ స్టంట్ అని.. అయితే జగన్ ఒక చిన్న పొరపాటు చేయకుంటే జనాలు నమ్మేవారేమో.. ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి ఆ మంటల్లో తన తప్పులన్నీ బూడిద చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే వైవీ సుబ్బారెడ్డి చేత హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా చేయాలని కేంద్రాన్ని అడుగుతామని చిలక పలుకులు పలికించారు. దీంతో తిరిగి వైసీపీ అధికారంలోకి వచ్చినా విశాఖ మాత్రం రాజధానిని చేసే సాహసం చేయరని.. తిరిగి తన నాటకాలు కంటిన్యూ చేస్తారని జనాలకు అర్థమైంది. అందుకే రిజర్వ్ బ్యాంక్ అనే కొత్త డ్రామాకు వైసీపీ ప్రభుత్వం తెరదీసింది.