నమ్మి వస్తే నట్టేట ముంచిన జగన్..!
ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని నమ్మడం ఎంత పాపమో ఇప్పటికే వైసీపీలోని కొందరికి తెలిసి ఉంటుంది. కానీ ఏం చేస్తారు? కక్కలేరు.. మింగలేరు. పోనీలే పార్టీని వదిలి బయటకు వద్దామా? అంటే దేఖేటోడే లేడు. నిన్న మొన్నటి వరకూ నోటికి వచ్చినట్టుగా తిట్టేసి ఇవాళ టీడీపీ వైపో.. జనసేన వైపో చూసేందుకు కూడా సాహసం చేయలేని పరిస్థితి. పైకి మాత్రం టికెట్ ఇవ్వకున్నా జగన్ పాదాల వద్దే బతికేస్తామంటూ కబుర్లు చెబుతారు కానీ ఎవరుంటారు చెప్పండి? రాజకీయ నేతలకెవరికైనా అధికారమే కదా కావాల్సింది. ఉత్సవ విగ్రహాలకైనా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పూజలు జరుగుతాయి కానీ రాజకీయాల్లో డమ్మీగా ఉంటే మొహంం కూడా చూసేవాడు ఉండడు.
చాలా మందిపై వేటు వేసేశారు..
పార్టీ గెలిచినా.. ఓడినా పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉంటేనే ఎవరైనా సరే కాస్త గౌరవం ఇస్తారు. లేదంటే సామాన్యుడికి.. నాయకుడికి పెద్దగా తేడా ఉండదు. ఇప్పుడు జగన్ సిట్టింగ్‌లకు సీటిస్తే కొంపమునుగుతుందని అనుకున్నారో ఏమో కానీ.. పెద్ద గొడ్డలి పట్టుకుని చాలా మందిపై వేటు వేసేశారు.. ఇంకా వేటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారిలో జగన్ మీద ఈగ వాలితే చాలు.. అది టీడీపీ ఈగేనని మీడియా ముందుకు వచ్చి నానా యాగీ చేసే కొడాలి నాని.. రాజకీయ భిక్ష పెట్టిన నేత కుమార్తెను వైసీపీలోకి వెళ్లీ వెళ్లగానే నిండు సభలో తూలనాడేందుకు సైతం వెనుకాడని వల్లభనేని వంశీని.. ఆర్థికంగా పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని.. ఎంపీ టికెట్ఇవ్వనన్నారని టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసి జగన్‌ను నెత్తిన పెట్టుకుని పదేళ్ల పాటు ఎంపీగా ఒక స్థాయిని కల్పించిన టీడీపీ అధినేత సహా ఇతర నేతలను ఇష్టానుసారంగా విమర్శిస్తున్న కేశినేని నాని ఉన్నారట.
ఇంకెవరికి జగన్ ప్రాధాన్యత కల్పించేది?
ఇక ఎవరిని జగన్ పైకి లేపేది? సర్వేలని.. అవని.. ఇవని.. ఇప్పటికే నమ్ముకున్న వారందరినీ నట్టేట ముంచేశారు. ఇక ఇప్పుడు వైసీపీకి మౌత్ పీస్‌లా ఉండి.. సమస్య వచ్చినా.. ఎవరైనా జగన్‌ను విమర్శించినా సెకన్లలో మీడియా ముందు ప్రత్యక్షమైన నేతల పైనా వేటు? వీరంతా జగన్‌కు పెట్టని కోటలా నిలిచారు. మరి అలాంటి వారిపైనే వేటు వేస్తే ఇంకెవరికిజగన్ ప్రాధాన్యత కల్పించేది? పొద్దున లేస్తే నీతి, నిజాయితీలని చెప్పే జగన్‌కు నైతికత ఉన్నట్టా.. లేనట్టా? ఇప్పటికైనా జగన్ ఎలాంటి వాడో ఈ నేతలందరూ తెలుసుకోవాలి. తెలుసుకున్నా ఏమీ చేయాలని పరిస్థితిలో ఉంటే కొడాలి నాని చెప్పినట్టు సీటు ఇచ్చినా ఇవ్వకున్నా కాళ్ల దగ్గర పడి ఉంటామని పైకి కథలు పడాలి. ఇక అంతకు మించి చేయగలిగిందేమీ లేదు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అని పెద్దలు ఊరికే అనలేదు.