ఏపీలో రేవంత్ ప్రచారం.. జగన్ దుకాణం సర్దేయాల్సిందేనా?
ఏపీలో వైసీపీ ఖేల్ ఖతం అవడానికి పెద్దగా సమయం పట్టేలా లేదు. ఒకవైపు టీడీపీ - జనసేనల కూటమి.. మరోవైపు సొంత చెల్లెలు, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. మరోవైపు కూటమిలో చేరితే బీజేపీ.. ఇవన్నింటితోపాటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంకృతాపరాధం. వెరసి వైసీపీ పాతాళానికి వెళ్లడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే అంతర్గత సర్వేలు సైతం వ్యతిరేక రిపోర్టులనే ఇచ్చాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలకు కారణాలను వెదికి పట్టుకుని సిట్టింగ్‌లకు సీటు ఇవ్వడం కారణంగానే బీఆర్ఎస్ ఓటమి పాలైందన్న కారణాన్ని మాత్రమే తీసుకుని ఎడాపెడా సిట్టింగ్‌లను జగన్ మార్చి పడేశారు.
జగన్‌కు షాకింగ్ న్యూస్..
ఫ్రస్టేషన్‌లో ఉన్నప్పుడు ఆలోచన మందగిస్తుంది. కనీసం సలహాలిచ్చేందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా లేకపాయే. ఇక ఏం చేయాలో తెలియని స్థితిలో ఏదో ఒకటి చేసేసుకుంటూ జనంలో చులకనవుతున్నారు జగన్. ఇక ప్రస్తుతానికైతే తనయుడి వివాహం కారణంగా చెల్లి షర్మిల కాస్త గ్యాప్ తీసుకున్నారు. దీంతో వేడెక్కిన జగన్ తలకు కాస్త ఉపశమనం లభించినట్టైంది. అయితే తాజాగా ఓ న్యూస్ జగన్‌కు షాక్ కలిగించేదిగా ఉంది. వీళ్లందరూ ఒక ఎత్తైతే.. ఏపీ ఎన్నికల ప్రచారంలో మరో వ్యక్తి ఎంటర్ కాబోతున్నారు. మాటల్లో దిట్ట అయిన కేసీఆర్‌నే మూడు చెరువుల నీళ్లు తాగించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారని టాక్.
విమర్శలు గుప్పిస్తే తట్టుకోగలరా?
ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు.. రేవంత్ ఏంటిరా బాబు.. తెలంగాణలో ప్రచారానికి వస్తున్నారని జగన్ కంగారు పడటం ఖాయం. ఎందుకంటే.. రేవంత్ మాటలకు యూత్ బాగా కనెక్ట్ అవుతారనడంలో సందేహం లేదు. అలాగే అన్ని వర్గాల ప్రజలు ఆయనకు అట్రాక్ట్ అవుతారనడంలో ఎలాంటి అనుమానమూ లేదు. ఒకరకంగా తెలంగాణలో నిర్వీర్యమైపోయిన కాంగ్రెస్‌కు ప్రాణం పోయడమే కాదు.. అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత రేవంత్‌దే. అలాంటి రేవంత్ ఏపీ రాజకీయాల్లో ప్రచారం నిర్వహిస్తే.. అమ్మో.. జగన్ దుకాణం మూసుకోవాల్సిందే. అసలే చెల్లి మాటలకే అల్లాడుతున్న జగన్.. రేపటి రోజున రేవంత్ వచ్చి విమర్శలు గుప్పిస్తే తట్టుకోగలరా? అసలు ఆయన మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేయగలిగే నేత ఏపీలో ఎవరైనా ఉన్నారా? ఏదన్న అంటే పాయింట్ లేకుండా బూతులతో విరుచుకుపడతారు. రేవంత్ అంతకు మించి అనగలరు. తెలంగాణ స్లాంగ్‌తో రేవంత్ చేసే విమర్శలకు జగన్‌కు దిమ్మతిరిగి బొమ్మ కనబడటం ఖాయం.