ఏపీలో ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలోనే వైసీపీ తమ పార్టీ నేతలను ఎలా గెలిపించుకోవాలన్న దానిపై కంటే ఎదుటి పార్టీ నేతలను ఎలా దెబ్బకొట్టాలన్న దానిపై ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. తమకు ఇబ్బందికరంగా మారుతున్నారనుకున్న నేతలతో సొంత మీడియాలో వ్యతిరేక కథనాలు ప్రసారం చేసి వారిని నైతికంగా దెబ్బకొట్టే యత్నం చేస్తోంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాపై సాక్షి మీడియాలో వ్యతిరే కథనాలను ఇష్టానుసారంగా ప్రసారం చేస్తోంది. నిజానికి గత ఎన్నికల్లో బోండా ఉమ కేవలం 25 ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. ఒక్క ఓటుతో ఓడిపోయినా కూడా అది ఓటమే కాబట్టి దీనిని పక్కనబెట్టేయాలి. ఆ సమయంలో వైసీపీ ప్రభంజనం కొనసాగుతోంది.
అధికారంలో ఉండి ఏం చేస్తున్నట్టు?
ఏపీలో అభివృద్ధి అంటే చిటికెలో జరిగిపోవాలనుకున్నారో ఏమో కానీ జనం.. అప్పట్లో జగన్ పక్షం వహించారు. కానీ ఐదేళ్లకే అసలు విషయం తెలిసొచ్చింది. అభివృద్ధి మాటే ఎరుగని జగన్‌పై ఇప్పుడు పీకల్లోతు కోపంతో ఉన్నారు. దీంతో వైసీపీకి ఏపీ వ్యాప్తంగా ఎదురు గాలి వీస్తోంది. టీడీపీ ముఖ్య నేతలను ఎదుర్కొని ఓడించడం అయ్యే పని కాదు. అందుకే వారిపై ఇష్టానుసారంగా కథనాలను ప్రసారం చేస్తోంది. వారిని మానసికంగా ఇబ్బంది పెట్టి పబ్బం గడుపుకునే యత్నం చేస్తోంది. బోండా ఉమ భూకబ్జాలకు పాల్పడ్డారని.. గూండాయిజం చేశారంటూ వరుస కథనాలను వండి వార్చింది. మరి ఇంతకాలం అధికారంలో ఉన్న వైసీపీ ఏం చేసినట్టు? చర్యలు తీసుకోవాలి కదా?
కేసులు నమోదు చేయకుండా ఎందుకు ఊరుకుంది?
ఇంతకాలం లేనిది అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల తర్వాత బోండా ఉమ భూకబ్జాలు గుర్తొచ్చాయా? ఇదే విషయాన్ని బోండా ఉమ సైతం ప్రశ్నించారు. 58 నెలలుగా అధికారంలో ఉన్న మీ ప్రభుత్వం నాపై కేసులు నమోదు చేయకుండా ఎందుకు ఊరుకుంది? కనీసం ఇప్పుడు తాను ఎమ్మెల్యేను కూడా కానని తమ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కూడా కాదని పేర్కొన్నారు. ఇంతకాలం మౌనంగా ఉండి.. దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టుగా.. ఇప్పుడెందుకు తనపై బురద జల్లిస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి రాజకీయాలు చేస్తే జనంలో వైసీపీ మరింత చులకన కావడం ఖాయం. వ్యతిరేకత ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి కానీ ఇదేం రాజకీయం జగనన్నా అని నెటిజన్లు సైతం ప్రశ్నిస్తున్నారు.