ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఎప్పుడు ఏ లిస్ట్ విడుదలవుతుందో.. ఆ లిస్ట్‌లో తాము ఉంటామో, లేదోనని పార్టీలు వేరైనా నేతలంతా ఆందోళన చెందుతున్నారు. టీడీపీ ఇంకా ఒక్క జాబితాను సైతం అధికారికంగా విడుదల చేయక ముందే.. వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జులకు సంబంధించి 6 జాబితాలను పార్టీ అధిష్ఠానం ఇప్పటికే విడుదల చేసింది. గత రాత్రి ఏడో జాబితాను సైతం విడుదల చేసింది. ఆరవ జాబితాలో పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ హై కమాండ్ మార్పులు, చేర్పులు చేసింది. దీనిలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 10 మార్పులు జరిగాయి. ఆరో జాబితాలో 4 పార్లమెంట్, 6 అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌లు ఉన్నారు.
ఆమంచి కృష్ణమోహన్‌కు హ్యాండ్ ఇచ్చిన వైసీపీ..
వైసీపీ అధిష్టానం చేయించిన సర్వేల్లో ఎవరికైతే ప్రజాదరణ తక్కువగా ఉందో.. వారిని నిర్మొహమాటంగా పక్కనబెట్టేసి గెలుపు గుర్రాలకు అవకాశం ఇస్తోంది. దీనిలో భాగంగానే వైసీపీ ఏడవ జాబితాలో అధిష్టానం ఇద్దరికి హ్యాండ్ ఇవ్వడం జరిగింది. కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మహిధర రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు పార్టీ నిరాకరించింది. ఆయన స్థానంలో శ్రీమతి కటారి అరవింద యాదవ్‌ను కందుకూరు ఇన్‌చార్జిగా అధిష్టానం నియమించింది. అలాగే పర్చూరు నియోజకవర్గంలో ఇన్‌చార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్‌కు సైతం మొండి చేయి చూపించింది. పర్చూరుకు యడం బాలాజీను సమన్వయకర్తగా నియమించింది. ఈ సారి జాబితాలో కేవలం రెండు పేర్లే కనిపిస్తున్నాయి. దాదాపు అర్ధరాత్రి సమయంలో ఈ ఏడవ జాబితాను విడుదల చేయడం జరిగింది.
పార్టీకి లాభమా.. నష్టమా?
ఇక ఏడో జాబితా విడుదలయ్యే వరకూ ఆ జాబితాలో ఎంతమంది ఉంటారు? అసలు అందరు సిట్టింగ్‌లకు స్థానం లభిస్తుందా? లేదా? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. వైసీపీ అధిష్టానం మొత్తంగా 7వ లిస్టుతో కలిపి 84 స్థానాలకు సంబంధించి ఇన్‌ఛార్జ్‌లను మార్చేసింది. తొలుత 60 మంది ఇన్‌చార్జులను మాత్రమే మారుస్తుందని అంతా భావించారు. కానీ ఫిగర్ 80 దాటేసింది. ఇప్పుడు ఈ రేంజ్‌లో తొలగింపులు పార్టీకి లాభమా.. నష్టమా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇంత పెద్ద మొత్తంలో మార్పులు.. చేర్పులంటే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తొలగించిన వారిలో కొందరు వేరొక పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు పార్టీలో ఉన్నా కూడా కొత్త ఇన్‌చార్జులకు ఏ మేరకు సాయపడతారనేది ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికి ఈసారి ఈ ఇన్‌చార్జుల మార్పు అంశం వైసీపీని గట్టెక్కిస్తుందో.. లేదో చూడాలి.