ఎస్.ఎస్. రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రాఫర్‌గా పేరున్న సెంథిల్ కుమార్ ఇంట విషాదం నెలకొంది. ఆయన భార్య, యోగా టీచ్ అయిన రూహీ గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొవిడ్ అనంతరం అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెకు ఈ మధ్య అవి ఎక్కువ అవడంతో.. హైదరాబాద్‌లోని హాస్పిటల్‌లో చేర్పించారు. గురువారం, ఆమెకు మల్టీపుల్ ఆర్గాన్స్ దెబ్బతినడంతో.. రూహీ మృతి చెందారు.
రూహీ యోగా శిక్షకురాలు. ప్రభాస్, అనుష్క, తమన్నా వంటి వారి దగ్గర ఆమె వర్క్ చేశారు. మగధీర సినిమా సమయంలో.. అంటే 2009లో రూహీ, సెంథిల్ వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. అయితే ఇప్పటి వరకు ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా అయితే ఎక్కడా వార్తలు రాలేదు. మరీ ముఖ్యంగా ఇంత సీరియస్ అనే విషయం కూడా బయటకి రాలేదు. సడెన్‌గా ఆమె మరణ వార్త తెలియడంతో.. చిత్ర పరిశ్రమ దిగ్ర్భాంతికి లోనవుతోంది.
రూహీ మరణ వార్త తెలిసిన వారంతా.. అదేంటి మొన్నీ మధ్య కూడా ఆమె ఆర్ఆర్ఆర్ పార్టీలో కనిపించింది కదా.. అంటూ షాక్ అవుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. సెంథిల్ మరియు ఆయన ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. రూహీ అంత్యక్రియలు శుక్రవారం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు.