రాజకీయాల్లోకి కొత్త సంప్రదాయాలను ప్రవేశ పెట్టిన ఘనత వైసీపీతో పాటు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిది. అదేంటంటే.. మంచైతే మన నెత్తిన వేసుకోవాలి. చెడు ఏం జరిగినా ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నెత్తిన వేయాలి. ఏపీలో ఏం జరిగినా సరే.. రయ్‌న వైసీపీ నేతలంతా మీడియా ముందుకు ఒకరి తర్వాత మరొకరు మీడియా ముందుకు రావాలి. మంచి చేయడం ఎలాగూ సాధ్యం కాదు కాబట్టి చేసిన చెడును ఒకరి తర్వాత మరొకరు చంద్రబాబు నెత్తిన వేసి ఒకటికి పది సార్లు ఒత్తి పలికి మరీ అబద్ధాన్ని నిజం చేయాలి. పైగా తమకు వ్యతిరేకంగా ఎవరు ఏ విమర్శ చేసినా కూడా వారి వెనుక చంద్రబాబు ఉన్నాడని ఏకరువు పెట్టాలి.
వైసీపీ, బీఆర్ఎస్‌లు ఒక తానులోని ముక్కలే..
ఒకవేళ జగన్ నిర్ణయాలను లేదంటే మరేదైనా కార్యక్రమాన్ని తప్పుబట్టారో వారు చంద్రబాబు స్క్రిప్ట్ చదివినట్టన్నమాట. మొత్తానికి ఏం చేసినా సరే.. దానికి చంద్రబాబే కారణమనాలి. వైసీపీ నేతలకు దీనిపై ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారో లేదంటే వారే స్వతహాగా జగన్ సంప్రదాయాన్ని అలవరుచుకున్నారో కానీ అందరిదీ అదే బాట. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నుంచి పురందేశ్వరి, తన సొంత చెల్లి షర్మిల, బాబాయి కూతురు సునీతా రెడ్డి, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ఇలా అందరూ చంద్రబాబు స్క్రిప్ట్ మాట్లాడేవారే. ఆసక్తికరంగా ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే సంప్రదాయం ప్రారంభమైంది. మరి వైసీపీ, బీఆర్ఎస్‌లు ఒక తానులోని ముక్కలే కదా..
కాకతీయుల రాజముద్రను తొలిగిస్తాం..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ పార్టీ అధినేతతో పాటు ఇతర నేతలను బాగా లాక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రేవంత్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. రాష్ట్ర అధికారిక చిహ్నంలో ఒక పక్క చార్మినార్.. మరో పక్క కాకతీయుల ఆనవాళ్లు ఉన్నాయంటే రాచరిక పోకడలు ఉట్టి పడుతుంటే మనం ఎక్కడ ఉన్నామని ప్రశ్నించారు. మనది ప్రజాస్వామ్య రాష్ట్రం కాబట్టి అధికారిక చిహ్నంలో రాచరిక పోకడలు ఉండటానికి వీల్లేదన్నారు. దీనిపై మాజీ మంత్రి పల్ల రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ఓరుగల్లు ప్రజల మనోభావాలు దెబ్బతినేలా కాకతీయుల రాజముద్రను తొలిగిస్తామని ముఖ్యమంత్రి చెప్పడం బాబు స్క్రిప్టులో భాగమేనన్నారు. ఏంటో తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగినా బాబేనా కారణం? రేవంత్‌కు సొంత ఆలోచనలేమీ లేవా? అసలు వీళ్లు బుర్రుండే మాట్లాడుతున్నారా? అని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు.