ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆయన సోదరి వైఎస్ షర్మిల ఏదో ఒకరకంగా లాక్ చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు చేపట్టింది మొదలు.. ఆమె తన సోదరుడు జగన్‌ను ఏకి పారేస్తూనే ఉన్నారు. అన్నా అంటూ సంబోధిస్తూనే షర్మిల జగన్‌ను ఉతికి ఆరేస్తున్నారు. ప్రస్తుతం షర్మిల రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు. తన తండ్రి వైఎస్‌కు, సోదరుడు జగన్‌కు ఎక్కడా పొంతనే లేదని పదే పదే చెబుతూ వస్తున్నారు. షర్మిల మాటలు జగన్ గుండెల్లో బాణాల మాదిరిగా గుచ్చుకుంటున్నాయి. అవినీతి మయమైన జగన్ సర్కార్‌ను నేలమట్టం చేస్తామని షర్మిల సవాల్ విసురుతున్నారు. జగన్‌కు చెవిలో జోరీగ మాదిరిగా తయారైన షర్మిల తాజాగా అన్నకు 9 ప్రశ్నలు సంధించారు.
దగా డీఎస్సీ..
డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఐదేళ్లుగా ఎదురు చూస్తున్న అభ్యర్థుల కోసం కేవలం 6,100 టీచర్ పోస్టులను ఏపీ సర్కార్ డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనిపై షర్మిల ఒకింత ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. నాడు వైఎస్సార్ 52 వేల పోస్టులతో మెగా డీస్సీని వేస్తే.. వారసుడిగా చెప్పుకునే జగనన్న 6 వేల పోస్టులతో డీఎస్సీ వేశారని.. ఇది దగా డీఎస్సీ అంటూ ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో జగన్ 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ఆమె జగన్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
నిరుద్యోగులను పొట్టనబెట్టుకునే కుట్ర చేస్తున్నారా?
మెగా డీఎస్సీ ఎక్కడ..? ఐదేళ్ల పాటు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎందుకు కాలయాపన చేశారు..? ఎన్నికలకు ఒకటిన్నర నెల ముందు 6 వేల పోస్టులు భర్తీ చేయడంలో ఆంతర్యం ఏంటి..? టెట్, డీఎస్సీలకు కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు వీటిలో దేనికి సన్నద్ధం కావాలి..? నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లోనే పరీక్షలు జరపడం దేశంలో ఎక్కడైనా ఉందా..? నోటిఫికేషన్ తర్వాత టెట్‌కు 20 రోజుల సమయం ఉంటే.. టెట్‌కు, డీఎస్సీకి మధ్య 6 రోజుల వ్యవధి మాత్రమేనా..? పరీక్షకు 100 రోజుల మాత్రమే గడువిచ్చిన సంగతి జగన్‌కు తెలియదా? ఇచ్చిన సిలబస్‌కు ఎన్ని పుస్తకాలు చదవాలో తెలియదా? రోజుకు 5 పుస్తకాలు చదవడం సాధ్యమేనా? నిరుద్యోగులకు పొట్టనబెట్టుకునే కుట్రేమైనా చేస్తున్నారా? అంటూ నిలదీశారు. మొత్తానికి జగన్ ఏ పని చేసినా దానిలో లొసుగులు తీసి మరీ షర్మిల ఏకి పారేస్తున్నారు.