జనసేనకు కాపు నేత, మాజీ మంత్రి హరి రామ జోగయ్య ఏమాత్రం ఉపయోగపడరు. ఒకరకంగా ఆయనొక కాలం చెల్లిన నాణెం. అప్పట్లో ఆయన హవా నడిచిందేమో కానీ ఇప్పుడు కాదు. అలాంటి హరిరామ జోగయ్య.. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు లేనిపోని ఆంక్షలు పెడుతూ.. పార్టీని ఏదో శాసించాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రోజుకో లేఖ.. కానీ దానిని పట్టించుకునే నాథుడేడి? ఇప్పటి వరకూ ఒక్క లేఖపై కూడా పవన్ స్పందించలేదంటే ఆయన వాటిని ఎంత లైట్ తీసుకుంటున్నారనేది అర్థమవుతోంది. అయినా సరే... ఆగరే. పైగా ఒక లేఖకు.. మరో లేఖకు పొంతన ఉండదు.
మొన్నటి వరకూ తన లేఖల ద్వారా వైసీపీకి ఫేర్ చేస్తూ.. జనసేనను ఇబ్బందుల పాలు చేసేలా వ్యవహరించారు. ఇప్పుడు సడెన్‌గా ఆయన యూటర్న్ తీసుకున్నారు. జనసేనకు తనో పెద్ద గైడ్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. నిన్నటికి నిన్న పవన్‌ను నమ్మాలని.. ఆయన వ్యూహాలను సందేహించడానికి లేదన్నట్టుగా లేఖ రాశారు. పైగా పవన్ అర్జునుడి మాదిరిగా విజయాలు సాధిస్తారంటూ కీర్తించారు. పవన్ ప్రతి నిర్ణయంలోనూ ఒక వ్యూహం ఉంటుందని హరి రామ జోగయ్య తెలిపారు. కాపులంతా ఐక్యంగా ఉండి.. ఒకరకంగా పవన్‌కు సహకరించాలన్నట్టుగా సూచనలు చేశారు. పోనీలే హరి రామ జోగయ్య ఇంతకాలానికైనా పవన్‌ను అర్థం చేసుకున్నారని అంతా భావించారు.
ఇవాళ జోగయ్య మరో లేఖ రాశారు. పవన్‌కు అన్నీ తెలుసన్న ఆయన ఇవాళ సూచనలు చేయడం ప్రారంభించారు. పశ్చిమ గోదావరిలో జనసేన గెలుస్తుందనుకున్న స్థానాలన్నింటినీ కట్టబెట్టకుంటే టీడీపీ నష్టపోవడం ఖాయమన్నట్టుగా చెబుతున్నారు. దాదాపు 13 స్థానాలు జనసేనకు కేటాయించాలని సూచించారు. కాపులకు మేలు కొలుపు అని నిన్న అందరినీ నిద్ర లేపి.. పవన్‌కు అన్నీ తెలుసన్న పెద్ద మనిషే.. ఇవాళ ఇలాంటి సూచనలు చేయడం ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. ఇక ఎంపీ స్థానాల విషయానికి వస్తే నర్సాపురం స్థానాన్ని జనసేనకు కేటాయించాలన్నారు. అసలు హరి రామ జోగయ్య ఏం అనుకుంటున్నారు? ఎందుకిలా రోజుకో మాదిరిగా లేఖలు రాస్తున్నారు? అనేది చర్చనీయాంశంగా మారింది. నిన్న పవన్ లైన్‌లోకి వచ్చినట్టుగా అనిపించిన హరి రామ జోగయ్య ఇవాళ పార్టీ నేతగా మారి సూచనలు కూడా చేస్తున్నారు.