నవ్విపోదురుగాక.. నాకేటి సిగ్గు.. అని వెనుకటికెవరో అన్నారట. ఇప్పుడు మాత్రం వైసీపీ వాళ్లు రోజుకోమారు అంటున్నారు. ఏపీకి ఒక్క రాజధానేంటి చీప్‌గా.. మూడు రాజధానులు ఉంటే గ్రాండ్‌గా ఉంటుందన్నారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆ తరువాత విశాఖ పరిపాలనా రాజధానిగా మార్చుకుంటున్నాం.. ఇక మీదట విశాఖ నుంచి పాలన అని ఇప్పటికి పాతిక సార్లు చెప్పారు. పాతిక డేట్లు మార్చారు. ఈ క్రమంలోనే బుుషికొండపై జగనన్న తన నివాసాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారండోయ్.. వందల కోట్ల రూపాయలు తగలేశారు. కానీ సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు పరిపాలన రాజధానిగా విశాఖను మారుస్తాం అంటే ఎక్కడ సాధ్యపడుతుంది?
న్యాయపరమైన అడ్డంకులతో సాధ్యం కాలేదట..
మొత్తానికి ఆ ఆలోచనను విరమించుకున్నారు. మహా అయితే రెండు మూడు నెలలు కథలు పడతారు. ఆ తరువాత సినిమా ముగుస్తుంది కదా. నెక్ట్స్ ఎన్నికల్లో గెలిచేదెవరో.. ఏమో. అయితే ఈ లోపే కొత్త డ్రామాకు వైసీపీ తెరదీసింది వైసీపీలో గట్టి నేత అయిన వైవీ సుబ్బారెడ్డి రెండు తెలుగు రాష్ట్రాలు షాక్ అయ్యే న్యూస్ ఒకటి చెప్పారు. రాజధాని కట్టుకునే స్థోమత లేక అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన విశాఖ నగరాన్ని రాజధానిగా చేద్దామని చాలా చిత్తశుద్ధితో ప్రయత్నించారట. అయితే దానికి న్యాయపరమైన అడ్డంకులు కల్పించడంతో అది సాధ్యపడలేదట. ఇక విశాఖ రాజధాని అయిపోయి ఉంటే సమస్య ఉండేది కాదని.. కానీ అదెప్పటికి సాధ్యపడుతుందో తెలియదు కాబట్టి హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిని చేయాలని కేంద్రాన్ని కోరుతారట.
జనం ఫోకస్ సెంటిమెంట్‌పైకి..
వైవీ సుబ్బారెడ్డి ఏం చెప్పారు? మాటల్లేవ్ కదా.. ఇంత గొప్ప ఆలోచన ఇప్పుడెందుకు వచ్చిందంటే.. వైసీపీ అధినేత జగన్.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌లు ఒకే తానులోని ముక్కలు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్ని రూట్లు మూసుకుపోయాక.. జగన్‌కు సైగ చేయించి నాగార్జున సాగర్ వద్ద గలాటా సృష్టించి తెలంగాణ సెంటిమెంట్ రగిలేలా చేయాలని చూసింది కేసీఆరేనని టాక్. ఇక ఇప్పుడు జగన్ కూడా అదే దారిలో వెళుతున్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటే ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్లు రాజుకుంటాయి. అప్పుడు జనాల ఫోకస్ మొత్తం ఈ సెంటిమెంటు వైపు మళ్లుతుంది. అప్పుడు ఐదేళ్ల పాలనలో చేసిన తప్పిదాలు.. వైఫల్యాలను ప్రజలు పట్టించుకోరు. అదిరిపోయే స్కెచ్ కదా ఇది.