ఏపీలో రాజకీయం బీభత్సంగా వేడెక్కుతోంది. టీడీపీ, జనసేనల మధ్య సీట్ల సర్దుబాటు కన్ఫర్మ్ అంటున్నారు కానీ ఇంతవరకూ అధికారిక ప్రకటన వెలువడింది లేదు. వైసీపీ ఒంటరి పోరు అంటున్నారు కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో బీజేపీ ఉందంటున్నారు. అది నమ్ముదామా? అనుకునేసరికి చంద్రబాబుకు ఢిల్లీ నుంచి కాల్.. పొత్తులపై చర్చలు. ఓకే పొత్తులు కన్ఫర్మ్ అయ్యాయి. ఇంకేముంది అధికారిక ప్రకటన బయటకు వస్తుందనుకున్నారంతా. మళ్లీ ట్విస్ట్. సాయంత్రానికి వైసీపీ అధినేత జగన్ ఢిల్లీకి చేరడం.. ఆయనతో బీజేపీ అధిష్టానం చర్చలు. బాబోయ్.. ప్రతి సీన్ క్లైమాక్సే. ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూస్తున్నట్టుగా అనిపిస్తోంది.
టీడీపీని మోదీ దగ్గర తాకట్టు పెట్టడమే..
అయితే అక్కడ జరుగుతున్నదేమీ లేదు కానీ కొండంత అన్నట్టుగా పరిస్థితులు చూపిస్తున్నాయ్. పైగా రోజుకో రూమర్ పుట్టుకొస్తూ జనాలను గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. బీజేపీ, జనసేనలు ఎప్పటి నుంచో పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీలకు కలిపి 70 సీట్లు కావాలని చంద్రబాబు ముందు అమిత్ షా ప్రతిపాదన పెట్టారంటూ ఓ టాక్ నడుస్తోంది. అసలే.. బీజేపీతో పొత్తు అంటే టీడీపీని ప్రధాని మోదీ దగ్గర తాకట్టు పెట్టడమేనని టాక్ నడుస్తోంది. నిజానికి టీడీపీ, బీజేపీల పొత్తు జనాలకు అసలు ఏమాత్రం నచ్చడం లేదు. కానీ ఎవరి ప్రయోజనాలు వారికి ఉండటంతో పొత్తు పెట్టుకునేందుకు టీడీపీ సిద్ధమై పోయింది.
కన్వర్షన్స్ బీభత్సంగా పెరిగిపోయాయట..
అయితే బీజేపీ, జనసేనలకు కలిపి 70 సీట్లేంటి? అసలు ఇందులో నిజమెంత? అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. నిజానికి సీట్ల విషయంలో పట్టుబట్టకూడదని బీజేపీ నిర్ణయించుకుందని టాక్. నిజానికి ఈ పొత్తుకు పూర్తి సహాయ సహకారాలు అందించింది ఆర్ఎస్ఎస్ అని టాక్. ఇంటెలిజెన్స్ రిపోర్టులు సైతం టీడీపీ విజయం ఖాయమంటూ నివేదికలు అందించాయని సమాచారం. దీంతో పాటు జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏపీలో కన్వర్షన్స్ బీభత్సంగా పెరిగిపోయాయని తెలుస్తోంది. దీనిని ఆర్ఎస్ఎస్ సహించలేకపోతోంది. ఈ క్రమంలోనే టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ అధిష్టానానికి సూచనలు చేసిందని సమాచారం. సీట్ల విషయంలోనూ పట్టుబట్టవద్దని తెలిపిందట. ముఖ్యంగా లోక్‌సభ విషయంలోనూ టీడీపీతో పొత్తు తమకు సహకరిస్తుందనే భావనలో బీజేపీ ఉందని తెలుస్తోంది.