ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ రహస్య స్నేహితులన్న విషయం తెలిసిందే. అవసరానికి తగ్గట్టుగా వీరిద్దరూ సహకరించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికలు రేపనగా.. నాగార్జున సాగర్ వద్ద తమ పోలీసులతో నానా హడావుడి చేశారు జగన్. ఆ తరువాత ఎన్నికల అనంతరమే సైలెంట్ అయిపోయారు. అప్పటికే ఇదంతా కేవలం తెలంగాణ జనంలో సింపతీని రగిలించడానికి కేసీఆర్, జగన్ ఆడుతున్న నాటకమని విపక్షాలు ఘోషిస్తూనే ఉన్నాయి. ఎన్నికల అనంతరమే ఏపీ పోలీసులు సైలెంట్ అవడంతో అది నిజమేనని జనం కూడా నిర్దారించారు. ఈ జగన్నాటకానికి జనం అయితే అస్సలు రియాక్ట్ అవలేదు.
ఒక్క విందుకే వేల కోట్ల ఆస్తులు..
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణం చేసిన కొద్ది రోజులకే హైదరాబాద్ వచ్చి కేసీఆర్ ఇంట విందు భోజనం చేసి వేల కోట్ల ఆస్తులను తెలంగాణ ప్రభుత్వానికి దారాదత్తం చేస్తున్నట్టుగా ఉన్న పత్రంపై సంతకం చేసిన ఘనుడు జగన్. ఇది ఎవరూ జీర్ణించుకోలేని నిజం. అంటే జగన్ ఒక్క విందు భోజనం ఖరీదు.. వేల కోట్ల ఏపీ ఆస్తులు. ఈ లెక్కన ఏపీని జగన్ ఏ రేంజ్‌లో నాశనం చేశారో అర్థమవుతుంది. ఇక కేసీఆర్ ఏమైనా తక్కువ తిన్నారా? నీళ్లు, నిధులు నియామకాలంటూ జనంలో తెలంగాణను రెచ్చగొట్టి వందల మంది బలితో తెలంగాణ వచ్చింది. అలాంటి తెలంగాణలో నీళ్లను రోజా ఇంట తిన్న రొయ్యల పులుసుకు తాకట్టు పెట్టేశారు.
బలమైన సాక్ష్యాలను చూపిస్తున్న విపక్షాలు..
ఇక తాజాగా తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాటి కేసీఆర్ ప్రభుత్వం బెండు తీసేసింది. కృష్ణా జలాల వాటాను ఏపీ ప్రభుత్వానికి అప్పగించి రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ చేసిన అన్యాయాన్ని బట్టబయలు చేసింది. తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి అసెంబ్లీలో జగన్ వీడియోలను ప్లే చేసి మరీ ఇజ్జత్ మొత్తం తీసేశారు. ఏపీ శాసనసభలో కేసీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తూ జగన్ చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోలను ప్లే చేశారు. అలాగే ఎన్నికల సమయంలో సాగర్ వద్ద జరిగిన రచ్చను ఏకిపారేశారు. మరోవైపు జగన్‌ను ఏపీలో విపక్షాలు ఎండగడుతున్నాయి. కృష్ణా జలాల హక్కులను ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి కట్టబెట్టిందంటూ బలమైన సాక్ష్యాలను చూపిస్తోంది. మొత్తానికి ప్రాజెక్ట్స్ రచ్చ మాత్రం తెలంగాణ, ఏపీల్లో మంటలు రేపుతోంది. మొత్తానికి కేసీఆర్, జగన్‌ల బంధం నాగార్జున సిమెంట్ కంటే స్ట్రాంగ్ అని కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లకు కట్టినట్టుగా వివరించింది.