జైలర్ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన చిత్రం లాల్ సలామ్. విడుదలకు ముందు ఈ సినిమాపై ఎటువంటి అంచనాలున్నాయో తెలియంది కాదు.. అందుకు కారణం జైలర్ విజయమే. అయితే ఫిబ్రవరి 9న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అనుకున్నంతగా, అంచనాలు ఉన్నంతగా అయితే సక్సెస్ సాధించలేకపోయింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్‌డ్ టాక్‌ను మాత్రమే అందుకుంది. అందుకేనేమో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు అంతగా ఇంట్రస్ట్ పెట్టడం లేదు. అందునా.. ఇప్పుడు ఎగ్జామ్స్ టైమ్ కూడా కావడంతో.. లాల్ సలామ్‌కు థియేటర్లు ఫుల్ అవడం కష్టంగా మారింది.
థియేటర్లలో లాల్ సలామ్ పరిస్థితి ఇలా ఉంటే.. అప్పుడే ఈ సినిమా ఓటీటీ డిటైల్స్ గురించి మీడియా సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. లాల్ సలామ్ థియేటర్లలో మెప్పించలేదు.. కానీ ఓటీటీలో మాత్రం ఖచ్చితంగా బ్రహ్మాండమైన విజయం అందుకుంటుందనేలా టాక్ మొదలైంది. అందుక్కారణం రజనీకాంత్ అల్లుడు ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రం కూడా థియేటర్లలో సక్సెస్ కాలేకపోయింది.. కానీ రీసెంట్‌గా ఓటీటీలో విడుదలై మంచి ఆదరణను అందుకుంటోంది. ఇదే బాటలో లాల్ సలామ్ కూడా ఓటీటీలో మంచి ఆదరణ పొందుతుందని భావించారో ఏమో కానీ.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వాళ్లు భారీ ధరకు ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్నారని తెలుస్తోంది.
సినిమా విడుదలైన 60 రోజులకు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ చేసేలా రైట్స్ తీసుకున్నప్పటికీ.. థియేటర్లలో సినిమా పరిస్థితి ఏం అంత గొప్పగా లేదు కాబట్టి.. ఇంకా ముందే లాల్ సలామ్ ఓటీటీలో దర్శనమిచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఈ సినిమాను తెరకెక్కించారు. విష్ణు విశాల్, విక్రాంత్, జీవితా రాజశేఖర్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాలో క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ ఓ కీలక పాత్రలో నటించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.