తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల నుంచి కాంగ్రెస్ హవా ప్రారంభమైంది. ఇక ఎన్నికల్లో విజయం సాధించాక పార్టీలోకి జంపింగ్స్ బీభత్సంగా పెరిగాయి. నేతలకు కావాల్సింది అధికార పార్టీలో ఉండటం. ప్రతిపక్షంలో ఉంటే ఏమోస్తుంది? అందునా పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. బీఆర్ఎస్ నుంచి రోజురోజుకూ చేరికలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానం పెట్టి కాంగ్రెస్ ఖాతాలో చేరిపోయాయి. ఇక నేతల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్‌గా మారింది.
ఆదేశాలిచ్చినా ఆగని నేతలు..
తమ నియోజకవర్గ సమస్యలు మాట్లాడేందుకు మాత్రమే సీఎంను కలిశామని సదరు నలుగురు ఎమ్మెల్యేలు చెబుతున్నప్పటికీ లోగుట్టు వేరే ఉందని జనం అనుకుంటున్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయిపోయింది. బీఆర్ఎస్ నేతలెవరైనా అధికార పార్టీ నాయకుల్ని కలిస్తే పార్టీకి ముందస్తు సమాచారం ఇవ్వాలని ఆదేశించిందట. ఆదేశాలు ఇచ్చినా కూడా నేతలు ఆగితేనా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి.. తన సతీమణి, వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి కలిసి వెళ్లి సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. వీరిద్దరూ కాంగ్రెస్‌లో చేరడం ఖాయమంటూ ప్రచారం జోరుగానే జరుగుతోంది.
ఓటమి పాలైన నరేందర్ రెడ్డి..
సునీతకు చేవెళ్ల ఎంపీ టికెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇది కూడా పట్నం మహేందర్ రెడ్డి దంపతులు పార్టీ మారేందుకు ఒక కారణంగా తెలుస్తోంది. అయితే పట్నం మహేందర్ రెడ్డితోనే ఎప్పుడూ ఆయన సోదరుడు నరేందర్ రెడ్డి కూడా ఉంటారు. కానీ ఈసారి నరేందర్ రెడ్డి మాత్రం కాంగ్రెస్‌లో చేరికకు దూరంగా ఉంటారని సమాచారం. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌పై పోటీ చేసి నరేందర్ రెడ్డి ఓటమి పాలవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఒక్కటిగా ఉన్న కుటుంబం.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న మహేందర్ రెడ్డి నిర్ణయంతో విభేదాలకు చోటు ఇచ్చినట్టుగా అవుతోంది. ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉండి అన్నదమ్ములిద్దరూ ఎలా ఉంటారోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో పెరుగుతోంది.