టీడీపీ, జనసేనలతో బీజేపీ కలిసి పోటీ చేయడం అయితే ఫిక్స్. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం ఈ విషయమై హింట్ ఇచ్చేశారు. సీట్ల సర్దుబాటు పూర్తైతే అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు వచ్చిన చిక్కల్లా ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికే. ఆయనకు ఉన్న సమస్యలకు తోడు కొత్త సమస్యలు తోడవుతున్నాయి. ఇప్పటికే చెల్లి షర్మిలను ఎలా ఎదుర్కోవాలా? అని సతమతమవుతున్న జగన్‌కు ఇప్పుడు కేంద్రాన్ని ఎదుర్కోవడం పెను సమస్యగా పరిణమించింది. టీడీపీ, జనసేనలను విమర్శించినంతగా సులువుగా ఆయన బీజేపీని విమర్శించలేరు.
మోదీతో రహస్య ఒప్పందాలు..
ఇక తన మంత్రులు, ఎమ్మెల్యేల నోటితో బీజేపీని మాటలనిపిద్దామా? అన్నా కూడా ఎవరైతేనేమి? ఒకే గూటి పక్షులు కదా. పరోక్షంగా జగన్ అన్నట్టే అవుతుంది. ప్రధాని మోదీ, అమిత్ షాలలో ఎవరి జోలికి వెళ్లినా కూడా జగన్‌కు ఇక్కట్లే. అక్రమాస్తుల కేసుల నుంచి వివేకా హత్య కేసు వరకూ అన్నీ కదులుతాయి. పోనీ విమర్శించకుండా ఉందామా? అంటే చెల్లి ఊరుకోదు. ఇప్పటికే జగనన్న ఢిల్లీకి వెళ్లి మోదీతో రహస్య ఒప్పందాలు చేసుకుని వచ్చాడంటూ విమర్శలు గుప్పించడం స్టార్ట్ చేసేసింది. చెల్లిని ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతున్న జగన్‌కు గోటి చుట్టుపై రోకలి పోటు మాదిరిగా కేంద్రం తయారైంది.
కక్కలేరు.. మింగలేరు..
ఇక కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాలంటే ఒకటి కాదు.. రెండు కాదు. ఎన్నో అంశాలున్నాయి. రాష్ట్రానికి కేంద్రం చేసిన నష్టం.. కేంద్రం తెచ్చిన చేటు అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఏపీలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందంటే దానికి జగన్ తీరుతో పాటు కేంద్ర ప్రమేయం కూడా ఉండటమే. కేంద్రాన్ని విమర్శించదలిస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తుండటం, ఇంకా అనేక విభజన హామీలు, నిధులు వంటివి ఎన్నో అంశాలున్నాయి. కానీ జగన్ వీటన్నింటినీ తీసి విమర్శించగలరా? అమ్మో.. కేంద్రం చేతిలో తనకు సంబంధించిన అస్త్రాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి వదిలితే సామ్రాజ్యమే కుప్పకూలి పోతుంది. కాబట్టి జగనన్న కక్కలేరు.. మింగలేరు. చెల్లి కూడా తనకు ప్రాణ హాని ఉందంటూ బహిరంగ విమర్శలు చేసి.. రక్షణ కోరి జగన్‌కు చెక్ పెట్టేసింది. ఆమెను కూడా ఏమీ చేయలేరు.