హీటెక్కుతున్న విజయవాడ.. అధిష్టానాలు అలెర్ట్ అవ్వాల్సిందే..
ఏపీలో ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. ఈ తరుణంలో ఏపీలో మరీ ముఖ్యంగా విజయవాడలో రచ్చ మామూలుగా లేదు. అన్ని పార్టీల్లోనూ గ్రూప్ వార్ ఓ రేంజ్‌లో జరుగుతోందని టాక్. టీడీపీ, వైసీపీ, జనసేన కాదేదీ గొడవకు అనర్హం అన్నట్టుగా ఉంది వ్యవహారం. ప్రధానంగా బెజవాడ పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో వ్యవహారం మాంచి రంజుమీదుంది. ఎలాగైనా సరే సీటు సొంతం చేసుకోవాలని నేతలు తమలో తామే కొట్లాడుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు కోసం టీడీపీ-జనసేన నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. టీడీపీ నుంచి బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్‌లు పోటీ పడుతున్నారు.
మైనార్టీలకే టికెట్ కేటాయించాలి..
అలాగే జనసేన నుంచి పోతిన మహేష్, గయాజుద్దీన్ పోటీ పడుతున్నారు. ఇద్దరూ కలిసి ఓ రేంజ్‌లో ప్రచారాలు, బల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఇద్దరు అనుచరులు పరస్పర దాడులకు సైతం దిగుతున్నారు. ఇక ఇదిలా ఉండగా.. సామాజిక వర్గాల మధ్య కూడా పోరు జరుగుతోంది. టీడీపీ నుంచి జలీల్ ఖాన్.. జనసేన నుంచి గయాజుద్దీన్ మైనార్టీలకే టికెట్ కేటాయించాలని పట్టుబడుతున్నారు. వైసీపీ వచ్చేసి మైనార్టీలకు టికెట్ ఇచ్చింది. దీంతో టీడీపీ - జనసేన నేతలు పోటీ పడుతున్నారు. ఇక వైసీపీ విషయానికి వస్తే.. విజయవాడ సెంట్రల్ టికెట్ కోసం వెల్లంపల్లి, మల్లాది విష్ణులు పోటీ పడుతున్నారు.
బోండా ఉమను టార్గెట్ చేస్తున్న వెల్లంపల్లి..
ఇప్పటికే విష్ణు వర్గాన్ని వెల్లంపల్లి దూరం పెట్టేశారు. కీలక బాధ్యతలన్నింటినీ పశ్చిమ నుంచి తీసుకొచ్చిన తన వర్గానికి అప్పగిస్తున్నారు. ఈ క్రమంలోనే విష్ణు వర్గం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లంపల్లికి సహకరించకూడదని డిసైడ్ అయ్యిందట. ఇక టీడీపీలో బోండా ఉమ, వంగవీటి రాధ వర్గాల మధ్య పోటీ నెలకొంది. రోజురోజుకి ఈ రెండు వర్గాల మధ్య టికెట్ వార్ పెరుగుతోంది. టికెట్ ఎవరికి ఇస్తారన్న క్లారిటీ రాకముందే ఈ ఇరు వర్గాలు వార్‌కు తెరదీస్తున్నాయి. ఈ క్రమంలోనే వెల్లంపల్లి కూడా బోండా ఉమను టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో టికెట్ ఎవరికనేది టీడీపీ త్వరగా తేలిస్తే బాగుంటుందని అంటున్నారు. మొత్తంగా విజయవాడ కేంద్రంగా అన్ని పార్టీల్లోనూ అలజడి అయితే నెలకొంది. పార్టీలు వీలైనంత త్వరగా వీటికి చెక్ పెడితే బాగుంటుంది.