జగన్‌కు ఉన్నంత సినిమా.. బాబు, పవన్‌కు లేదేం!
సినిమాలకు.. రాజకీయాలకు ఒక అవినాభావ సంబంధం ఉంది. వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన నటీ నటులు రాజకీయాల్లోకి వచ్చి.. నిజ జీవితంలో రాష్ట్రాలు, దేశాలను పాలించారు. అంతేకాదు సినిమాలు.. రాజకీయాలను, రాష్ట్ర ప్రజలను చాలా ప్రభావితం చేస్తాయి. ఇవే సినిమాలు ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి.. కుప్ప కూల్చి పడేశాయి కూడా!. సరిగ్గా ఈ పాయింటునే ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఎంచుకున్నారు. 2019 ఎన్నికల ముందు.. ఇప్పుడు ఇదే ఫార్ములానే తెలుగు ప్రజలపై ఆయన అప్లయ్ చేస్తున్నారు.. గ్రాండ్ సక్సెస్ కూడా అయ్యారు.. అవుతున్నారు. ఐతే ఇండస్ట్రీలో అందరూ టీడీపీ అధినేత చంద్రబాబు మనుషులు ఉన్నా.. ఇంకొకరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే పుట్టి.. పెరిగినా సరిగ్గా సినిమాను వాడుకొలేక పోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది..? జగన్ జెట్ స్పీడులో ఉంటే.. బాబు, పవన్ మాత్రం వెనుక పడ్డారు.
ఇదొక అస్త్రం!!
ఏపీలో ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. వైసీపీ ఏదో ఒక సినిమాతో సిద్ధమైపోతుంది. ఏకంగా ఒకరినైతే ఆస్థాన దర్శకుడిని చేసుకుంది. ఆ దర్శకుడు ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వల్గారిటీకి కేరాఫ్.. మాటల విషయానికి వస్తే.. వైసీపీ బూతు నేతలకు ఏమాత్రం తీసిపోరు. ఇలాంటి వారిని పెట్టుకుని మరీ వైసీపీ గేమ్ ఆడుతోంది. సింపతీతో జనాలను ఆకట్టుకోవాలని చూస్తోంది. తనను తానొక జనం కోసమే పుట్టిన మెస్సయ్యగా జగన్ అభివర్ణించుకుంటున్నారు. చివరకు తను జైలుకు వెళ్లిన దాన్ని కూడా ఎవరో ఇచ్చిన మాట కోసం వెళ్లానని సినిమా ద్వారా జనాలకు చేరవేయించుకుంటున్నారు. తనలోని మైనస్‌లన్నింటినీ సినిమా ద్వారా ప్లస్ చేసుకుంటున్నారు.
చేతుల్లో పనే కదా చంద్రన్న!
గత ఎన్నికల సమయంలో యాత్ర సినిమాను తీసి జనాల మీదకు వదిలారు. ఆ సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రచార అస్త్రంగా వాడేశారు. ఆయనను చూపించి జనాల సింపతీని రాబట్టారు. ఇక ఈ సారి ఏకంగా రెండు సినిమాలు యాత్ర 2, వ్యూహం. మళ్లీ వీటిలో ఒక సినిమాను తమ ఆస్థాన దర్శకుడి చేతనే తీయించారు. ఈ రెండు సినిమాలకు ఆర్జీవీ, మహి. వి. రాఘవ దర్శకత్వం వహించారు. ఇలా జగన్ ఎన్నికలొస్తే చాలు జనాలను ఎమోషనల్‌గా కొడుతుంటే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నట్టు? చంద్రబాబు చేతిలో ఇండస్ట్రీయే ఉంది. ఆయన చెబితే చాలు సినిమాలు తీసేందుకు రాఘవేంద్రరావు సహా చాలా మంది దర్శకులు ముందుకు వస్తారు.
ఆర్డర్ వేస్తే చాలు కదా..!
పోనీ చంద్రబాబుకు తీసేందుకు స్క్రిప్ట్ లేదా? అంటే కావల్సినంత ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు రెండు సార్లు సీఎంగా విధులు నిర్వర్తించారు. పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ... ఇప్పటికీ ఎక్కువ కాలం సీఎంగా చేసిన తెలుగు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు అన్నీ ఇన్నీ కావు. డ్వాక్రా పథకాన్ని మహిళల కోసం ప్రవేశపెట్టారు. మహిళలను స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించారు. ఇక హైటెక్ సిటీ కట్టి ఏకంగా సైబరాబాద్‌ను నిర్మించిన ఘనత ఆయదే. అసలు హైదరాబాద్ ఈస్థాయిలో అభివృద్ధి చెందిందంటే చంద్రబాబు చలవే. ఇక ఏపీలోనూ రాజధాని నిర్మాణం.. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే సామాన్యుల కోసం ప్రజావేదిక వంటివి నిర్మించారు. హుద్ హుద్ సమయంలో ఆయన దగ్గరుండి పరిస్థితిని నార్మల్‌కి తీసుకొచ్చారు. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో ఉన్నాయి. ఇక వైసీపీ ప్రభుత్వం చేసిందంతా అవినీతే. అభివృద్ధి లేదు. పరిశ్రమలను పారదోలారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇంతకు మించిన స్క్రిప్ట్ చంద్రబాబు, పవన్‌లకు ఏం కావాలి? చేయలేకపోయారా? లేదంటే చేవ చచ్చిందా? అని టీడీపీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
ఒక ప్లాన్ అనేదు లేదేం!
ఇక పవన్ కల్యాణ్ ఏకంగా ఇండస్ట్రీని ఏలుతున్న స్టార్ హీరో. పవన్ చెప్పినా ఎందరో దర్శకులు సినిమా తీసేందుకు ముందుకు వస్తారు. మరి వారెందుకు సినిమాలు తీయడం లేదు? ముల్లును ముల్లుతోనే తీయాలన్న నానుడిని వీళ్లెలా మరిచారు? ఇండస్ట్రీలో ఈ స్థాయిలో సత్సంబంధాలు ఉండి కూడా సినిమా రిలీజ్ అవకుండా కోర్టులో కేసు వేసి కూర్చొంటారా? అసలు జగన్ అంత ప్లాన్డ్‌గా ముందుకు వెళుతుంటే.. రాజకీయాల్లో ఇంత సీనియారిటీ ఉన్న చంద్రబాబు ఏం చేస్తున్నట్టు? గత ఎన్నికల్లోనూ వైసీపీ ఇదే చేసింది. ఈసారైనా ప్లాన్డ్‌గా ఉండాలి కదా? మరెందుకు లేవు? పవన్ అయినా సరే.. సినిమాల్లో ఏదో ఒక డైలాగ్‌తో కాకుండా ఏకంగా ఒక సినిమా తీసి వదిలితే ఎంత మంచి ప్రచారాస్త్రం అవుతుంది. పొత్తులపై ఉన్న ఆరాటం.. జనాలకు సినిమాల ద్వారా చేరువవుదామనే దానిపై ఉండకుంటే ఎలా? అని టీడీపీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.