వైసీపీ ఆశలపై నీళ్లు చల్లిన ఇండియా టు డే...
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పి పోల్ సర్వేలు బీభత్సంగా వస్తున్నాయి. చాలా సర్వే సంస్థలు ప్రజల నాడిని తెలుసుకునే పనిలో పడ్డాయి. అయితే ఇప్పటి వరకూ వచ్చిన సర్వేలన్నీ ఒక్క ఎత్తు. ఇప్పుడు వస్తున్న సర్వేలు మరో ఎత్తు. ఇప్పుడొస్తున్న సర్వేలైతే వైసీపీ ఆశల మీద నీళ్లు చల్లుతున్నాయి. పొత్తుల కారణంగా తామెక్కడ ఓడిపోతామోనని భయపడుతున్న వైసీపీకి ఈ సర్వేలు మరింత భయపెడుతున్నాయి. టీడీపీ - జనసేన పొత్తును ఎలాగైనా విడగొట్టాలని వైసీపీ నానా తంటాలు పడింది. ఇప్పుడు ఈ పార్టీలకు తోడు బీజేపీ కూడా తోడు కానుంది. ఇక ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న వైసీపీకి గోరు చుట్టపై రోకటి పోటు మాదిరిగా ఇప్పుడు సర్వేలు ఇబ్బందికరంగా తయారయ్యాయి.
మూడ్ అఫ్ ది నేషన్ సర్వే పేరిట సర్వే..
ప్రస్తుతం నేషనల్ మీడియాతో పాటు పలు సర్వే సంస్థలు ఏపీలో ఓటర్ నాడిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రముఖ జాతీయ సంస్థ అయిన ఇండియా టుడే.. సీ ఓటర్ సంస్థతో కలిసి మూడ్ అఫ్ ది నేషన్ సర్వే పేరిట ఏపీలో సర్వే నిర్వహించింది. ముఖ్యంగా పార్లమెంటు స్థానాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ సర్వేను జరిపింది. ఏపీలో 25 పార్లమెంటు స్థానాలకు గానూ.. టీడీపీ - జనసేన కూటమి 17 ఎంపీ స్థానాలను, వైసీపీ 8 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని వెల్లడించింది.ఇప్పటి వరకూ వచ్చిన సర్వేలకు ఇది పూర్తిగా భిన్నంగా ఉంది. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే టీడీపీ - జనసేన కూటమి 119 స్థానాలను, వైసీపీ 56 స్థానాలను కైవసం చేసుకుంటుందని తెలిపింది.
రాజకీయ నాయకులతో శిక్షణ..
ఇక టీడీపీ - జనసేన కూటమి 45 శాతం ఓట్లను కైవసం చేసుకుంటుందని.. వైసీపీ 41 శాతం ఓట్లను దక్కించుకుంటుందని సి ఓటర్ సర్వే తెలిపింది. మొత్తానికి ఈ సారి అధికారం టీడీపీ - జనసేన కూటమిదేనని సి ఓటర్ సంస్థ తేల్చింది. తమకు అనుకూలంగా ఉన్న అధికారులందరినీ కీలక ప్రాంతాలకు ఇప్పటికే వైసీపీ మార్చేసింది. అలాగే వలంటీర్లకు తమ పార్టీకి చెందిన రాజకీయ నాయకులతో శిక్షణ ఇప్పిస్తోంది. ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓట్లు వేయించేలా వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఈ ఎత్తులన్నింటినీ చిత్తు చేసి టీడీపీ అధికారాన్ని దక్కించుకుంటుందని సీ ఓటర్ సంస్థ తేల్చింది. ఆ వెంటనే అన్ని శాఖల మంత్రి సజ్జల మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. తమకు వ్యతిరేకంగా సర్వే ఫలితాలను వెల్లడించిన సర్వే సంస్థలకు విశ్వసనీయత లేదని.. ఎవరూ నమ్మవద్దని చెప్పారు.