భద్రత విషయంలో షర్మిలకు ఎందుకింత ఆందోళన?
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఎందుకు అంతలా భయపడుతున్నారు? ఎవరి వల్ల తనకు ప్రాణ హాని ఉందని భయపడుతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. నిజానికి అప్పుడెప్పుడో టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు సైతం షర్మిల భద్రత విషయమై అనుమానం వ్యక్తం చేశారు. షర్మిల తనకు తాను జాగ్రత్త తీసుకుంటూనే పోలీసులను భద్రత కోరాలని అప్పుడే అయ్యన్న ఆమెకు సూచించారు. ఆ సమయంలో వైసీపీ నేతలు అయ్యన్నపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు షర్మిలే స్వయంగా మీడియా ముందుకు వచ్చి తనకు ప్రాణహాని ఉందని చెప్పారు.
నాకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత లేదా?
తాజాగా గన్నవరం విమానాశ్రయంలో షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. తాను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించాల్సి ఉందని.. అయితే తనకు రాజకీయ శత్రువుల నుంచి ప్రమాదం పొంచి ఉందన్నారు. ఇప్పటికే తనకు భద్రతక కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారట. కానీ ఎవరూ పట్టించుకోలేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆమె ఏకి పారేశారు. ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర చీఫ్‌గా ఉన్న తన భద్రత గురించి పట్టించుకోరా? అని ప్రశ్నించారు. తనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. తనకు ఏదైనా జరగాలని ప్రభుత్వం కోరుకుంటోందా? అని కూడా షర్మిల నిలదీశారు.
షర్మిలను వైసీపీ ఊరికే వదిలేస్తుందా?
జగన్మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడున్నా వారికి.. మంత్రులకు భద్రత కల్పించుకుంటే సరిపోతుందా? అని షర్మిల ప్రశ్నించారు. గత ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసి గుండెపోటు మరణమని నమ్మించాలని చూశారు. ఈ మరణాన్ని ఎన్నికల్లో సింపతీ కోసం వైసీపీ నేతలు చక్కగా వినియోగించుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో షర్మిల తన భద్రత గురించి ఆందోళన చెందడం సహజమే. అందునా ప్రస్తుతం జగన్ ప్రభుత్వానికి అన్ని విధాలుగా షర్మిల అడ్డుపడుతున్నారు. మరి అలాంటి షర్మిలను వైసీపీ ఊరికే వదిలేస్తుందా? నిజానికి షర్మిల భయపడటంతో తప్పు లేదని రాష్ట్రంలో చర్చ జరుగుతోంది.