నిన్నటి నుంచి కోలీవుడ్ హీరో విశాల్ రాజకీయాల్లోకి రాబోతున్నాడు, విశాల్ కొత్త పార్టీ పెట్టి 2026 ఎన్నికల్లో పోటీ చేస్తాడు, అందుకే విశాల్ సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరవవుతున్నాడు అంటూ కోలీవుడ్ మీడియా సర్కిల్స్ నుంచి సోషల్ మీడియావరకు ఒకటే ప్రచారం జరుగుతుంది. హీరో విజయ్ పార్టీ పెట్టాడు, ఇప్పుడు విశాల్ పార్టీ పెడుతున్నాడంటూ ట్విట్టర్ X లో విశాల్ పేరు ట్రెండ్ అవుతుంది. విశాల్ పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలపై విశాల్ స్పందించాడు.
తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని విశాల్ కొట్టి పారేసాడు. నన్ను నటుడిగా, సామజిక కార్యకర్తగా గుర్తించిన తమిళ ప్రజలకి ఎప్పటికి రుణపడి ఉంటాను. నాకు చేతనైనంతలో అందరికి సహాయం చేయాలనుకుంటున్నాను. అందుకే నా ఫాన్స్ క్లబ్ కూడా ఏదో సాదా సీదాగా కాకుండా అందరికి ఉపయోగపడేలా ఉండాలనుకుంటున్నాను. ఆపదలో ఉన్న వారికి చేయూతనివ్వాలన్నదే మా ఫాన్స్ క్లబ్ ప్రధాన లక్ష్యం. తదుపరి ఆలోచనగా.. నియోజక వర్గాలవారీగా, జిల్లాల వారీగా ప్రజా సంక్షేమ ఉద్యమాన్ని చేపట్టబోతున్నాము.
మా అమ్మ పేరుతో మొదలు పెట్టిన దేవి ఫౌండేషన్ ద్వారా నిరుపేద విద్యార్థులకి చేయూతనిస్తున్నాము, అలాగే రైతులకి సహాయం చేస్తున్నాం. షూటింగ్ కోసం వెళుతున్న ప్రదేశాల్లో జనాల అవసరాలను తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు చేతనైనంత సహాయం చేస్తున్నాము, దీని ద్వారా రాజకీయంగా లాభపడాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. జనాలు కోరుకుంటే.. భవిష్యత్తులో సమాజం కోసం రాజకీయాల్లోకి రావొచ్చేమో అంటూ విశాల్ తన పొలిటికల్ ఎంట్రీ పై జరుగుతున్న ప్రచారానికి సోషల్ మీడియా ద్వారా అడ్డుకట్ట వేసాడు.