గాలికి కొట్టుకుపోతా.. ధూళికి ఎగిరిపోతానంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీలో బీభత్సమైన నైరాశ్యంతో మాట్లాడారు. టన్నుల కొద్దీ సింపథీని గెయిన్ చేయడానికి తాపత్రయ పడ్డారు. అసలు విషయం ఏంటా? అని ఆరా తీస్తే.. టీడీపీ, జనసేనల పొత్తులో బీజేపీ కూడా చేరబోతోందని తెలిసింది. టీడీపీ, జనసేనల పొత్తునే విచ్ఛిన్నం చేయడానికి వైసీపీ నానా తంటాలు పడుతుంటే.. బీజేపీ కూడా వచ్చి చేరబోతోందన్న న్యూస్ జగన్ చెవిన పడినట్టుంది. తప్పు చేస్తే నేనే గాలికి ఎగిరిపోతాను కదా.. దానికోసం ప్రతిపక్షం పొత్తులు పెట్టుకోవాలా? అంటూ జగన్ మాట్లాడారు. తన అసహనాన్ని మొత్తం మాటల్లో చెప్పకనే చెప్పారు.
ఎన్ని ఎంపీ స్థానాలు అడగాలి?
టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు దాదాపు ఫిక్స్ అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల్లో పోటీ చేయాల్సిన స్థానాలు.. పొత్తులో భాగంగా ఎన్ని ఎంపీ స్థానాలు అడగాలి? ఎక్కడెక్కడ పోటీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి? అభ్యర్దులుగా ఎవరెవరు ఉన్నారు? అనే విషయాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమ పార్టీ రాష్ట్ర నేతల నుంచి సమాచారం తీసుకుంటున్నారట. రేపు టీడీపీ అధినేత చంద్రబాబు హస్తినకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాకకు ముందే అమిత్ షా సమాచారం మొత్తం సేకరిస్తున్నారని తెలుస్తోంది. నేటి మధ్యాహ్నం నుంచి పలు దఫాలుగా పలువురు నేతలతో విడివిడిగా భేటీ అయ్యి అవసరమైన సమాచారాన్నంతా సేకరించారట.
కీలక సమాచారాన్ని సేకరిస్తున్న షా..
ఇక చంద్రబాబుతో చర్చించాల్సిన అంశాలను కూడా అమిత్ షా ఖరారు చేసేశారట. గతంలో పోటీ చేసి గెలిచిన స్థానాలు, రెండో స్థానంలో నిలిచిన స్థానాల జాబితాను నేతలు సిద్దం చేస్తున్నారు. చంద్రబాబుతో చర్చల్లో ప్రతిపాదించాల్సిన ఎంపీ సీట్లపై పార్టీ నేతల నుంచి కీలక సమాచారాన్ని అమిత్ షా తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక పార్లమెంటు స్థానాల విషయానికి వస్తే.. అరకు, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు లేదా నర్సాపురం, కాకినాడ, మచిలీపట్నం, ఒంగోలు లేదా నెల్లూరు, తిరుపతి, రాజంపేట, అనంతపురం లేదా హిందూపూర్ స్థానాలు బీజేపీ ప్రతిపాదనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అసెంబ్లీ స్థానాలు దాదాపు 10 వరకూ అడగాలని బీజేపీ యోచిస్తోందట. చంద్రబాబుతో భేటీ అనంతరం అన్ని విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.