అయిన వాళ్లకు ఆకుల్లోనూ.. కాని వారికి కంచాల్లోనూ వడ్డించడం ఏపీ సీఎం జగన్‌కు అలవాటే. ఇక తనకు అడ్డు అనుకుంటే అయిన వారికి కనీసం కంచాల్లో కూడా వడ్డించరు.. నడి రోడ్డుకు లాగుతారనుకోండి.. అది వేరే విషయం. మరి ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. మెగాస్టార్ చిరంజీవికి తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్‌ను ప్రకటించింది. ఇది ఎంత పెద్ద విషయం? సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, చివరకు సామాన్యులు సైతం చిరుకి అభినందనలు తెలిపారు. మెగాస్టార్‌ను కలవగలిగిన వారు నేరుగా వెళ్లి అభినందిస్తే.. కలవలేని వారు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మొత్తానికి ఏదో విధంగా అయితే చిరుకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు అయితే తెలిపారు.
చిరును సన్మానించిన తెలంగాణ ప్రభుత్వం..
ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా చిరుకు పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం నిర్వహించింది. చిరంజీవి సినిమా షూటింగ్‌లో భాగంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఉంటే ఆయన వద్దకు మంత్రి జూపల్లి వెళ్లి శాలువాతో సత్కరించి సన్మాన కార్యక్రమానికి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఇక ఈ నెల 4వ తేదీన శిల్పకళా వేదిక ప్రాంగణంలో చిరుతో పాటు పద్మ అవార్డు గ్రహీలందరినీ ఘనంగా సన్మానించింది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం అసలు చిరుకు పద్మ విభూషణ్ వచ్చిన విషయాన్నే పట్టించుకోలేదు. కనీసం ఆయనకు సోషల్ మీడియా వేదికగా అయినా శుభాకాంక్షలు చెప్పిన పాపాన పోలేదు. ఓ పుష్పగుచ్చాన్ని సైతం పంపించింది లేదు.
పవన్‌కు మద్దతుగా నిలిచారా?
ఇప్పటి వరకూ అన్న.. అన్న అంటూ చిరును పలకరించి దగ్గరకు తీసుకున్న జగన్.. ఇప్పుడు పద్మ అవార్డు వస్తే మాత్రం పట్టించుకోకపోవడం పట్ల జనం అవాక్కవుతున్నారు. నిజానికి చిరు అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. దానిని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. కేంద్రమంత్రిగా కొనసాగారు. ఇక అంతే.. రాజకీయాలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేసి కళామతల్లికి దగ్గరయ్యారు. అలాంటి చిరు.. జగన్‌కు ఎందుకు నచ్చలేదు? పోనీ ఆయన తన తమ్ముడు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఏమైనా సమర్థిస్తున్నారా? మద్దతుగా నిలిచారా? అంటే అదీ లేదు. కనీసం తమ్ముడి రాజకీయంలో సైతం చిరు వేలు పెట్టింది లేదు. అలాంటి చిరును అభినందించేందుకు ఏం ఇబ్బంది? ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా? జగన్‌కే తెలియాలి.