గేమ్ ఛేంజర్ అప్ డేట్స్ విషయంలో మెగా ఫాన్స్ కి కునుకు రావడం లేదు. ఇప్పటివరకు ఓపిగ్గా వెయిట్ చేస్తున్న అభిమానుల సహనానికి దర్శకుడు శంకర్ అడుగడుగునా పరీక్షా పెడుతున్నారు. రెండు పడవల మీద కాళ్ళేసి.. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ షూటింగ్స్ ని చేసుకుంటూ వస్తున్నారు. దానితో ఈ రెండు సినిమాల విడుదల తేదీలపై అందరిలో ఆసక్తి నెలకొంటే మెగా ఫాన్స్ లో మాత్రం ఆందోళన, గందరగోళం మొదలయ్యింది. రామ్ చరణ్ వెండితెర మీద కనిపించి రెండేళ్లు పూర్తవుతుంది.
కానీ ఇప్పటివరకు గేమ్ ఛేంజర్ విడుదలపై నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శంకర్ అప్ డేట్ ఇవ్వకుండా అభిమానులని ఎదురు చూసేలా చేస్తున్నారు. అభిమానుల సహనం నశించినప్పుడల్లా #WakeUpShankar అంటూ హాష్ టాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు. తాజాగా గేమ్ ఛేంజర్ అప్ డేట్ చూస్తే.. మెగా అభిమానులకి నీరసాలే. గేమ్ ఛేంజర్ కి సంబంధించి త్వరలోనే ఓ షెడ్యూల్ ఉంటుంది, జూన్ నాటికి హీరో చరణ్ పై చిత్రీకరణ పూర్తవుతుంది. ఆ తర్వాత మిగతా నటులపై షూట్ మరో నెల ఉంటుంది.. అంటూ సోషల్ మీడియాలో అప్ డేట్స్ దర్శనమిస్తున్నాయి.
అంటే దాదాపుగా ఆగస్టు నెల వరకు గేమ్ ఛేంజర్ షూటింగ్ సాగుతూనే ఉంటుంది. ఈలెక్కన గేమ్ ఛేంజర్ దసరా కి విడుదల అయ్యే అవకాశం ఉంటుందా అనేది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్.. అంటూ సోషల్ మీడియాలో కనిపించిన వార్తలు చూసి మెగా అభిమానులు డిస్పాయింట్ అవుతున్నారు.