ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పిడి వైసీపీ మెడకు గుదిబండ మాదిరిగా చుట్టుకుంటోంది. ఇది వైసీపీ నేతల మధ్యే చిచ్చు పెట్టింది. వైసీపీలో రెండు పార్టీలు ఏర్పడ్డాయి. సిట్టింగ్‌లు వర్సెస్ నియోజకవర్గ ఇన్‌చార్జుల మధ్య పార్టీలో వార్ జరుగుతోంది. ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు వీరిద్దరి మధ్య వార్‌లో వైసీపీ కేడర్ ఇబ్బంది పడుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పిడి కార్యక్రమం అయితే పెద్ద రచ్చకే దారి తీసింది. మరి ఇంతటి డేరింగ్ స్టెప్ రేపటి రోజున పార్టీని నిలబెడుతుందా? కూలదోస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రతి జిల్లాలోనూ ఇన్‌చార్జుల మార్పిడి పార్టీకి తలనొప్పులు తెచ్చి పెడుతోంది.
పార్టీకి దూరమైన కాపు..
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మూడు స్థానాల్లో వైసీపీ మార్పులు, చేర్పులకు తెరదీసింది. ఈ జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో వైసీపీ మార్పులు చేసింది. అయితే ఇన్‌చార్జుల మార్పిడిలో భాగంగా.. మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, శింగనమల ఎమ్మెల్యే పద్మావతి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి వైసీపీ అధిష్టానం హ్యాండ్ ఇచ్చింది. శింగనమల మినహా మిగిలిన ఐదు చోట్ల టికెట్ల మార్పిడి రచ్చ రచ్చ చేస్తోంది. టికెట్ దక్కకపోవడంతో కొద్ది రోజులుగా కాపు రామచంద్రారెడ్డి అయితే పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక మడకశిరలో సిట్టింగ్‌ను పక్కనబెట్టి ద్వితీయ శ్రేణి నేత కూడా కానీ లక్క ఈరప్పను అధిష్టానం తెరపైకి తీసుకొచ్చింది. ఇక్కడ తిప్పేస్వామికి తెలియకుండానే కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయట.
పెనుగొండ ఎమ్మెల్యేను పక్కనబెట్టిన ఉషశ్రీ..
అలాగే పెనుగొండలో కొత్త వివాదం ప్రారంభమైంది. పెనుకొండ సమన్వయకర్త బాధ్యతలను అధిష్టానం మంత్రి ఉషశ్రీ చరణ్‌కు అప్పగింది. ఇక మంత్రి హోదాలో ఉషశ్రీ అయితే పాల్గొంటున్నారు కానీ లోకల్ ఎమ్మెల్యేకు అవకాశమే లేకుండా చేస్తున్నారని టాక్. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేకు అనంతపురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినా ప్రస్తుతానికైతే పెనుగొండ ఎమ్మెల్యేగానే ఉన్నారు. మరి అలాంటప్పుడు అధికారిక కార్యక్రమాలకు శంకర్ నారాయణ్‌ను పిలవాలి కదా.. అలా పిలవకపోవడమేంటని స్థానిక నేతలు ఫైర్ అవుతున్నారు. కదిరిలో సిద్దారెడ్డిని సైడ్ చేసి మైనార్టీ నేత మక్బూల్‌కు వైసీపీ పట్టంగట్టింది. వీరిద్దరిదీ ఎవరి దారి వారిదే. ఇక ఆ తర్వాత సిద్దారెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మొత్తానికి అన్ని నియోజకవర్గాల్లోనూ రచ్చ జరుగుతూనే ఉంది.