రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి, జానా.. నెగ్గేదెవరు!
కాంగ్రెస్ అంటే కొట్లాటలు, అలకలకు మారుపేరన్నది జగమెరిగిన సత్యమే.. దీంతోనే పలు రాష్ట్రాల్లో చేజేతులా ప్రభుత్వాన్ని కూల్చుకున్నది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత అదే ఊపులో తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. గెలిచిన మరుక్షణం నుంచే నేనంటే నేను.. నేనే సీఎం అని ఎవరికి వాళ్లు ప్రకటనలు చేసేసుకున్నారు. సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డికే అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.. ‘ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను..’ అని ప్రమాణం చేసేసి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. సెమీ ఫైనల్ అయిన అసెంబ్లీ ఎన్నికల్లో పాసయిన రేవంత్ ముందు పార్లమెంట్ ఎన్నికలు పెద్ద అగ్ని పరీక్షగా మారాయి. కనీసం 10 నుంచి 15 లోక్‌సభ స్థానాలను గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ క్రమంలో ఆశావహుల నుంచి అప్లికేషన్స్ స్వీకరిస్తూ.. అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో తలమునకలైంది అధిష్టానం.
వర్కవుట్ అయ్యేనా..?
తెలంగాణలో నల్గొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలు కీలకం. ఉమ్మడి నల్లొండ జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట. నాటి నుంచి నేటి వరకూ చెక్కు చెదరలేదు. ఒకటి అరా సీట్లు పోయినా కోటను మాత్రం బీఆర్ఎస్ బద్ధలు కొట్టలేకపోయింది. ఇప్పుడు అధికారంలో ఉండటం, పైగా ఇదే జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉండటం.. అందులోనూ దాదాపుగా ఉమ్మడి జిల్లాలో ఎక్కువ సీట్లు గెలవడంతో ఈజీగా ఈ రెండు పార్లమెంట్ స్థానాలను కొట్టేయచ్చన్నది కాంగ్రెస్ టార్గెట్. అందుకే తమ కుటుంబ సభ్యులను బరిలోకి దింపడానికి కీలక నేతలంతా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ రెండు ఎంపీ సీట్లు తమ కుటుంబానికే కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధిష్టానాన్ని పట్టుబట్టారని తెలియవచ్చింది. ఇందులో నల్గొండ అభ్యర్థిగా కోమటిరెడ్డి కుమార్తె శ్రీనిధి, ఇంకొకటి కుటుంబ సభ్యుడు, బంధువైన చంద్ర పవన్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. కచ్చితంగా ఇవ్వాల్సిందేనని.. తాను చెప్పిన ఈ ఇద్దరికీ ఇస్తే కచ్చితంగా రెండూ గెలిపించుకునే వస్తానని మాటిచ్చారట కోమటిరెడ్డి. అయితే.. ఫ్యామిలీ పాలిటిక్స్ అనే ముద్ర నుంచి బయటపడాలంటే ఇలా కుటుంబ సభ్యులను ఎంకరేజ్ చేయకూడదని అధిష్టానం భావిస్తోందట.
మాకూ కావాల్సిందే..!
ఇక నల్గొండ సీటు కోసం కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి పట్టుబట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్ నుంచి కుమారుడు జైవీర్ రెడ్డిని గెలిపించుకున్న జానా.. మరో కుమారుడ్నీ రాజకీయాల్లోకి తీసుకురావడానికి తహతహలాడుతున్నారు. అందుకే.. రఘువీర్‌ను నల్గొండ సీటుకోసం దరఖాస్తు చేయించారు. ఇక అవన్నీ అటుంచితే.. పటేల్ రమేష్ రెడ్డి పేరు అందరికీ గుర్తుండే ఉంటుంది.. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో ఈయన అభిమానులు, అనుచరులు నానా రచ్చ చేశారు. ఆఖరికి ఎమోషనల్ అయిన పటేల్.. కంటతడిపెట్టారు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ రాకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో సీటు వస్తుంది కదా అని రేవంత్ రెడ్డి ధైర్యం చెప్పారట. దీంతో తనకు టికెట్ రాకున్నా టికెట్ వచ్చిన వారికి అన్నీ తానై చూసుకున్నారు రమేష్. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడు పటేల్.. దీంతో టికెట్ ఎలా రాకుండా పోతుందో చూద్దామన్న కోణంలో పటేల్ రమేష్ రెడ్డి ఉన్నారు. మొత్తానికి చూస్తే.. రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి, జానారెడ్డిగా పరిస్థితులు కచ్చితంగా అవ్వడానికి అవకాశముంది. ఇన్నాళ్లు లేని గొడవ ఈ టికెట్ల విషయంలో కాంగ్రెస్ నేతల మధ్య వచ్చినా పెద్దగా ఆశ్చర్య పోనక్కర్లేదేమో. ఫైనల్‌గా ఏం తేలుతుందో చూడాలి మరి.