ఏపీ పీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టాక దూకుడు పెంచేశారు. ఒకవైపు వైసీపీ అధినేత, సొంత అన్న అయిన షర్మిలను ఏకి పారేస్తూనే మరోవైపు ప్రత్యేక హోదా అంశాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకెళుతున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలను కలిసి ఏపీ సమస్యల పరిష్కారానికి మద్దతు కోరారు. ఇక ఏపీలో ఒక్కటంటే ఒక్క హామీని కూడా అమలు చేయలేదని అలాంటప్పుడు ఏపీలోని పార్టీలన్ని బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నాయని ప్రశ్నించారు. అన్ని పార్టీలను ఆమె ఏకి పారేస్తున్నారు. ఇక అధికార వైసీపీని అయితే ఒకింత ఎక్కువే దుయ్యబడుతున్నారు.
ఇప్పుడే కొత్తగా తప్పులు చేస్తున్నారా?
ఇంత పెను పోరాటం.. ఈ విమర్శలు.. అన్నను ఏకిపారేయడం అన్నీ గతంలో ఏమయ్యాయి? జగనన్న ఇప్పుడే కొత్తగా తప్పులు చేస్తున్నారా? లేదంటే హామీలు నెరవేరలేదన్న విషయం షర్మిలకు ఇప్పుడే గుర్తొచ్చిందా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించి మోదీ ప్రభుత్వం మోసం చేసింది. అలాగే ప్రత్యేక ప్యాకేజీ అంటూ మాట మార్చింది. కనీసం అది అయినా ఇస్తుందా? అంటే అదీ లేదు. పదేళ్లుగా ఏపీకి ప్రతి ఒక్క విషయంలోనూ ఇంత అన్యాయం జరుగుతున్నా పార్టీలు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది కేవలం ఎన్నికల కోసం మాత్రమే వాడుతున్నారు.
షర్మిల పోరాటం ఎన్నికల వరకే ఉంటుందా?
ఇప్పుడు షర్మిల కూడా అదే చేస్తున్నారు. ఇంతకాలం ఏపీకి ప్రత్యే హోదా లేదు అన్న విషయం ఆమెకు గుర్తు లేదు. ఇక కడప స్టీల్ ప్లాంట్ అంశం సోదిలోనే లేకుండా పోయింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్, మోదీల మధ్య ఏం జరిగిందో కానీ అది కూడా మరుగున పడిపోయింది. ఇప్పటికైనా షర్మిల అయితే ఈ అంశాలపై గళం విప్పారు. పార్టీలన్నీ కూడా ఏపీ సమస్యలపై జరుగుతున్న పోరాటానికి మద్దతు ఇస్తామని చెబుతున్నాయి. కానీ షర్మిల పోరాటం ఎన్నికల వరకే ఉంటుందా? ఆ తరువాత కూడా ఉంటుందా? అనేది తెలియడం లేదు. నిజానికి అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలోకి వచ్చేది అసాధ్యమే.కానీ షర్మిల తీరు చూస్తుంటే మాత్రం అంతో ఇంతో కాంగ్రెస్‌కు హైప్ వచ్చే అవకాశం అయితే లేకపోలేదు.