కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా సంచలనం కెప్టెన్ మిల్లర్ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా గత శుక్రవారమే తెలుగులో విడుదలైంది. తెలుగులో విడుదలైన రెండు వారాలకే ఈ సినిమా ఓటీటీలో దర్శనమివ్వనుంది. సంక్రాంతికి థియేటర్ల సమస్య తలెత్తడంతో.. టాలీవుడ్‌లో ఈ సినిమా విడుదల కాలేదు. జనవరి 26న థియేటర్లలో విడుదలై.. మిక్స్‌డ్ స్పందనను రాబట్టుకుంది. కోలీవుడ్‌లో మాత్రం ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ధనుష్ ఖాతాలో మరో రూ. 100 కోట్ల చిత్రంగా అక్కడ కెప్టెన్ మిల్లర్ కలెక్షన్స్ రాబట్టింది.
ఇక ఈ సినిమా ఫిబ్రవరి 9 నుండి డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుందని తెలుస్తుంది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో స్ట్రీమింగ్‌కు సిద్ధం చేస్తోంది. యాక్షన్ ప్రియులకు నచ్చే ఈ సినిమాను ఓటీటీలో చూడొచ్చులే అని చాలా మంది థియేటర్ల వైపు వెళ్లలేదు. అలాంటి వారి కోసమే.. ముందే ఈ సినిమాని స్ట్రీమింగ్‌కు రెడీ చేస్తున్నారు. ఇందులో ధనుష్ అగ్నీశ్వర్ పాత్ర నుండి కెప్టెన్ మిల్లర్‌గా ఎలా మారాడు అనేదే ఆసక్తికరమైన అంశం. ఓటీటీలో ఈ సినిమా తప్పకుండా మంచి ఆదరణను పొందుతుందని మేకర్స్ సైతం భావిస్తున్నారు.
ధనుష్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటించిన ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రల్లో నటించారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించగా, జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు. స్వాతంత్య్రం రాక ముందు అంటే 1930 నుంచి 1940 మధ్య జరిగే కథగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులోని యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయనే టాక్ ఎలాగూ ఉంది కాబట్టి.. కచ్చితంగా ఓటీటీలో ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కే అవకాశమే ఉంది.