యంగ్ హీరో నిఖిల్ విషయంలో ఈ మధ్య ఓ వార్త వైరల్ అయిన విషయం తెలిసిందే. నిఖిల్, పల్లవి దంపతులు పేరేంట్స్ కాబోతున్నారని.. పల్లవి బేబీ బంప్‌తో ఉందంటూ వార్తలైతే వైరల్ అయ్యాయి కానీ.. నిఖిల్ మాత్రం ఎక్కడా రివీల్ చేయలేదు. ఇప్పుడు స్వయంగా నిఖిలే ట్విట్టర్ ఎక్స్ వేదికగా తండ్రి కాబోతున్నట్లుగా ప్రకటించాడు. తన భార్యకు సీమంతం జరుగుతున్న ఫొటోని షేర్ చేసిన నిఖిల్.. అసలు విషయం అందరికీ చెప్పేశాడు. దీంతో ఆయన షేర్ చేసిన ఫొటో, చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భార్య పల్లవి శ్రీమంతపు వేడుక ఫొటోని షేర్ చేసిన నిఖిల్.. సీమంతం.. భారతీయ సాంప్రదాయ రూపంలో బేబీ షవర్. అతి త్వరలో మేము మా మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నామని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాం. దయచేసి మీ ఆశీస్సులు మాకు ఇవ్వాలని కోరుతున్నామని చెప్పుకొచ్చాడు. దీంతో ఇన్నాళ్లుగా రహస్యంగా ఉంచిన వార్త.. ఇప్పుడు పబ్లిక్ అయిపోయింది. నిఖిల్ చేసిన ఈ పోస్ట్‌కి ఆయన ఫ్యాన్స్ అలాగే నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతూ.. నిఖిల్ పేరును ట్రెండ్‌లోకి తీసుకొచ్చింది.
ఇక నిఖిల్ సినిమాల విషయానికి వస్తే.. టాలీవుడ్ యంగ్ హీరోలకు నెంబరింగ్ ఇస్తే.. అందులో నిఖిల్ టాప్ ప్లేస్‌లో ఉంటాడు. ఆయన ఎన్నుకునే చిత్రాలు అలా ఉంటాయి మరి. కార్తికేయ 2 సినిమా అయితే నిఖిల్‌ని పాన్ ఇండియా హీరోని చేసింది. ఇప్పుడు చేస్తున్న సినిమాలు కూడా కొన్ని పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. అలాగే త్వరలోనే కార్తికేయ 3 సినిమా షూటింగ్‌లోనూ నిఖిల్ పాల్గొననున్నారు. ప్రస్తుతం చైతూతో చందు మొండేటి చేస్తున్న సినిమా పూర్తవ్వగానే.. కార్తికేయ 3 సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉంది.