చిరు వ్యాపారి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వివాదం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దాదాపు 10 సంవత్సరాల నుండి ఆమె ఫుడ్ స్టాల్ నడుపుతున్నా రాని పాపులారిటీ.. ఈ ఒక్క సంవత్సరం (2023-24) ఆమె సొంతం చేసుకుంది. అందుకు కారణాలు ఏంటనేది పక్కన పెడితే.. ఆమె పాపులారిటీనే ఇప్పుడామెకు ప్రాబ్లమ్‌గా మారింది. సంవత్సరానికి ఆమె ఈ ఫుడ్ బిజినెస్‌లో కోట్ల రూపాయలు ఆర్జిస్తుంది.. టాక్స్‌లు కట్టదు అంటూ ఓ వర్గం సోషల్ మీడియాలో ఆమెని టార్గెట్ చేస్తే.. కొందరు మాత్రం అందరినీ తిన్నావా అంటూ ఆప్యాయంగా పలకరించి.. కడుపునిండా భోజనం పెట్టి పంపుతుందంటూ.. ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రస్తుతం ఆమె రేంజ్ ఏ స్థాయికి వెళ్లిదంటే.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో సినిమాల ప్రమోషన్ కోసం సెలబ్రిటీలు ఎలా అయితే వస్తారో.. అలా సినిమా ప్రమోషన్ కోసం ఆమె దగ్గరకు వెళ్లేంతగా కుమారి ఆంటీ ఫేమస్ అయిపోయింది. జనాలు ఆమె పెట్టే ఫుడ్ కోసం కట్టే క్యూ తో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే స్థాయికి ఆమె బిజినెస్ చేరుకుంది. ఈ ట్రాఫిక్ సమస్యే ఆమెకు చిక్కులు తెచ్చిపెట్టింది. ట్రాఫిక్ పోలీసులు ఆమె స్టాల్‌ని మార్చాలంటూ హుకుం జారీ చేసే స్థాయికి తీసుకెళ్లింది. అంతే.. సోషల్ మీడియాలో కుమారి ఆంటీ ట్రెండ్ అవుతోంది.
ఉన్నపళంగా ఫుడ్ స్టాల్ మార్చాలంటే ఎలా అంటూ కన్నీరుమున్నీరైంది. ఆమె కన్నీరు చూసి కరిగిపోయిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆమెకు అండగా నిలబడతానని మాటిచ్చారు. ఫుడ్ స్టాల్ స్థలాన్ని మార్చవద్దంటూ అధికారులకు ఆదేశాలిచ్చారు.. సమయం వచ్చినప్పుడు స్టాల్‌ని సందర్శిస్తానని మాట కూడా ఇచ్చారు. అంతే.. ఒక్కసారిగా సీఎం రేవంత్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కుమారి ఆంటీ కూడా సీఎం రేవంత్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. సీఎం ఎప్పుడు తన స్టాల్ దగ్గరకు వచ్చినా.. ఆయనకు ఇష్టమైన వంటకాన్ని వండిపెడతానంటోంది కుమారి. అది మ్యాటర్.