ఏ ముహూర్తాన ప్రశాంత్ వర్మ హను-మాన్ సినిమాని అనుకున్నాడో గానీ.. ఇప్పటికీ ప్రేక్షకులు ఆ మత్తు నుండి దిగలేకపోతున్నారు. ఇంకా థియేటర్ల వద్ద కోలాహలం కనిపిస్తూనే ఉంది.. కలెక్షన్ల వర్షం కురుస్తూనే ఉంది. స్టార్లతో పనిలేదు.. కంటెంట్ ఉంటే చాలు అని మరోసారి నిరూపించింది.. నిరూపిస్తోందీ చిత్రం. మాములుగా అయితే ఓవర్సీస్‌లో ఏ సినిమా అయినా విడుదలైన వారం, 10 రోజుల వరకే హవా చూపిస్తుంది. కొన్ని సినిమాలు ఒక వీక్‌పై తేలిపోతాయి. కానీ హనుమాన్ సినిమా ఓవర్సీస్‌లోనూ ఇంకా తన హవా కొనసాగిస్తూనే ఉంది.
ఇక చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ఈ సినిమాలోని పూలమ్మే పిల్ల వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో టాప్ 2లో ట్రెండ్ అవుతోంది. ఈ పాటలో పెద్దగా స్టార్ పవర్ ఏం లేదు. తేజ సజ్జా, అమృత అయ్యర్ మాత్రమే కనిపిస్తారు. కానీ టాప్ 2లో ట్రెండ్ అవుతుందంటే.. కారణం మ్యూజిక్, సాంగ్, సాంగ్ చిత్రీకరించిన లొకేషన్స్. అన్నింటికీ మిచ్చి ఈ పాట అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగందం నింపుకుని ఉండటం. అందుకే చూడగానే నచ్చేస్తోంది. ఈ పాట గురించి ఓ నెటిజన్ ఏమని కామెంట్ చేశాడో తెలుసా..
ఈ పాట వింటుంటే.. 2000 సంవత్సరం నుంచి 2010 మధ్యలో వచ్చిన సాంగ్స్ ఎంత స్వచ్ఛంగా.. అచ్చమైన తెలుగు పదాల అల్లికలతో.. రెండు చరణాలతో.. ఉండేవో అలా ఉంది. చాలా కాలం తరువాత అలాగే రెండు చరణాలతో.. అచ్చమైన తెలుగు పదాలతో అందమైన ప్రేమ పాట వచ్చింది. నాకు ఈ పాట చాలా నచ్చింది. ఉగాది తెలుగు వాళ్లకు అసలైన సంవత్సరం పండుగ, ఈ సాంగ్ కూడా తెలుగు వాళ్లకు ఉగాది లాగే ఉంది. మనసుకు నచ్చిన అందమైన స్వచ్ఛమైన ప్రేమ పాట.. అని పోస్ట్ చేశాడు. ఒక్కడే కాదు.. పాట కింద కామెంట్ చేసిన ప్రతి ఒక్కరి అభిప్రాయం ఇదే..