ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన హను-మాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీనే సృష్టించింది. ఈ సినిమా సాధించిన విజయం ఎవరూ ఊహించనిది. ఆఫ్‌కోర్స్ మెగాస్టార్ ముందే చెప్పారనుకోండి. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో.. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోబోతుందని మెగాస్టార్ చిరంజీవి యూనిట్‌కు ఆశీస్సులతో పాటు ధైర్యాన్నిచ్చారు. ఆయన ఆశీస్సులతో పాటు సినిమాలో ఉన్న కంటెంట్ కూడా ప్రేక్షకులని మెప్పించడంతో.. హను-మాన్ విజయవిహారం షురూ అయింది. హనుమాన్ సీక్వెల్, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చే రెండో చిత్రం కోసం వేచి చూసేలా చేసింది.
రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేంటి? అనే ఆసక్తికరమైన పాయింట్‌తో హను-మాన్‌ని ముగించి.. సీక్వెల్ జైహనుమాన్‌పై అందరిలో అమితాసక్తిని కలిగించాడు ప్రశాంత్ వర్మ. జైహనుమాన్‌కు సంబంధించి చిత్రీకరణ ప్రారంభించే పనిలో ఉన్న ప్రశాంత్ వర్మ.. పార్ట్ 2లో రాముడు, హనుమంతుడు పాత్రలకు సంబంధించి ఇంట్రస్టింగ్ విశేషాలను షేర్ చేసుకున్నాడు. ఇందులో హనుమంతుడి పాత్ర కోసం మెగాస్టార్ చిరంజీవిని సంప్రదించాలని చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
మెగాస్టార్ చిరంజీవి ఇష్టదైవం ఆంజనేయుడు. ఈ విషయం ఎవరిని అడిగినా చెబుతారు. హను-మాన్‌లో కూడా హనుమంతుడి పాత్రకు ప్రశాంత్ వర్మ చిరంజీవి కళ్లనే చూపించాడు. ఇప్పుడు ఏకంగా ఆ పాత్రనే చేయించేపనిలో ఉన్నాడు. అయితే ప్రస్తుతం పద్మవిభూషణ్ వచ్చిన ఆనందంలో ఉన్న చిరంజీవిని ఈ పాత్రకోసం అడగడానికి ప్రశాంత్ వర్మ టెన్షన్ పడుతున్నాడట. విషయం చెప్పాలని ఎప్పుడాయన దగ్గరకు వెళ్లినా.. ఆయన చుట్టూ జనమే ఉంటున్నారట. వీలు చూసుకుని వెళ్లి కలిసి.. హనుమంతుడి పాత్రకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తానని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు.
ఇక హనుమంతుడి పాత్రను చిరంజీవితో చేయించాలని అనుకున్న వర్మ.. రాముడి పాత్ర కోసం సూపర్ స్టార్ మహేష్ బాబుని అనుకుంటున్నాడట. ఆల్రెడీ గ్రాఫిక్స్‌లో మహేష్ బాబుతో కొన్ని ప్రయోగాలు కూడా చేశాడట. టీమ్ అంతా శ్రీరాముడిగా మహేష్ బాబు అయితేనే పర్ఫెక్ట్ అనే అభిప్రాయానికి వచ్చారని ప్రశాంత్ వర్మ తెలిపాడు. అయితే మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమాకు రెడీ అవుతున్నాడు. మరి రాముడి పాత్రకు మహేష్ ఓకే చెబుతాడా అనేది మాత్రం డౌటే. హనుమంతుడిగా చిరంజీవి చేయవచ్చేమో కానీ.. మహేష్ బాబు మాత్రం రాముడిగా చేయడానికి ఇష్టపడినా.. జక్కన్న చేతుల్లో ఉన్నాడు కాబట్టి సాధ్యపడకపోవచ్చని.. ప్రశాంత్ వర్మ మాటలు విన్న వారంతా అనుకుంటున్నారు.