ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వాస్తవానికి 5 సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి కానీ.. చివరి నిమిషంలో రవితేజ ఈగల్ సినిమా వాయిదా పడింది. అయినా కూడా బాక్సాఫీస్ వద్ద మహేష్ బాబు, నాగార్జున, వెంకీ, చిన్న హీరో తేజ సజ్జాల రూపంలో భారీ ఫైటే జరిగింది. ఈ నలుగురు, అలాగే నాలుగు సినిమాల రిజల్ట్ సంగతి ఏంటనేది పక్కన పెడితే.. ప్రేక్షకులకు మాత్రం సంక్రాంతికి కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ లభించిందనే చెప్పుకోవాలి. ఇక సంక్రాంతి ముగిసింది.. కొత్త చిత్రాలు ఒక్కొక్కటిగా విడుదల తేదీలను ఫిక్స్ చేసుకుంటున్నాయి. తాజాగా గోపీచంద్ హీరోగా నటిస్తోన్న భీమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ విడుదల తేదీ రాగానే.. మరోసారి సంక్రాంతి ఫైట్ తలపించేలా శివరాత్రికి ఫైట్ ఉంటుందనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఎందుకంటే భీమా సినిమా మార్చి 8న మహాశివరాత్రి కానుకగా విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా కంటే ముందే రెండు సినిమాలు వచ్చేందుకు ఆ డేట్‌కి ఫిక్సయ్యాయి. ఆ సినిమాలు ఏవంటే.. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కుతోన్న డబుల్ ఇస్మార్ట్ ఒకటి కాగా, రెండోది విశ్వక్‌సేన్ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా. ఈ రెండు సినిమాలు మార్చి 8న రిలీజ్ అని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు.
ఇప్పుడు భీమా కూడా యాడవ్వడంతో మహాశివరాత్రికి మాంచి ఫైట్ ఉండబోతుందనేలా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు మొదలయ్యాయి. ఈ మూడు సినిమాలతో పాటు రెండు మూడు చిన్న సినిమాలు కూడా ఉండే అవకాశం ఉంది. అదే జరిగితే.. మరోసారి థియేటర్ల ఇష్యూ జరిగే పరిస్థితులు నెలకొన్నట్లే. చూద్దాం.. మార్చి 8న పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో..