ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ షర్మిల.. వీరిద్దరిలో తప్పెవరిదంటే చెప్పడం కష్టం. వీరిద్దరిలోనూ మొండితనం మెండుగానే ఉంది. అయితే జగన్ నేరుగా తన సోదరిని దూషించలేరు. తన అనుయాయుల ద్వారా మాత్రమే తిట్టిస్తారు. కానీ షర్మిల మాత్రం వెనుకా ముందూ చూసుకోకుండా ఏకి పారేస్తోంది. అసలు జగన్ పంతాలకు పోకుండా షర్మిలతో ఇంటి గొడవను పరిష్కరించుకుని ఉంటే ఇప్పుడీ గొడవే ఉండేది కాదు. షర్మిల ఏకు మేకై కూర్చునేది అంతకన్నా కాదు. జగన్‌కు అధికారంతో పాటు డబ్బు కావాలి. షర్మిలకు ఇంచుమించుగా అంతే. అయితే జగన్ అన్యాయం చేయకుండా ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసుకుని ఉంటే షర్మిల సంతృప్తి చెందేవారేమో.
ఏకైక లక్ష్యం అధికారమే..
అయితే జగన్ అలా చేస్తారా? చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వడమేంటని అనుకున్నారు. అక్కడే తొలి దెబ్బ పడిపోయింది. పైగా ఆయన అధికారంలోకి రావడానికి కారణమే షర్మిల. ఆమె పాదయాత్ర చేయకుంటే పరిస్థితి ఎలా ఉండేదనేది ఊహించలేం. అలాంటి షర్మిలకు ఆస్తిలో కొంత భాగమిచ్చి ఒక ఎంపీని చేసుంటే ఆమె కూడా జగన్ అన్న అడుగులకు మడుగులు వత్తి ఉండేవారు. కానీ జగన్ అది చేయలేదే.. నిజానికి జగన్ వైసీపీని స్థాపించినప్పుడైనా.. ఇప్పుడైనా సరే.. ఆయన ఏకైక లక్ష్యం అధికారం. మరి షర్మిలకు కూడా అధికారంపై ఎంతో కొంత మక్కువ ఉంటుంది కదా. దానిని జగన్ గమనించి ఉంటే బాగుండేది. అధికారంలోకి రాగానే షర్మిలను సైడ్ చేసేశారు. అప్పటికి షర్మిల బినామీ పేర్లతో మైన్స్ బిజినెస్ చేస్తూనే ఉన్నారు.
జగన్ కేరెక్టర్‌ను జనాలకు చూపించాలన్నదే లక్ష్యం..
ఆమె భర్త అనిల్ కూడా వ్యాపారాలు చేస్తూనే ఉన్నారు. ఆ మాటకొస్తే జగన్‌కు కూడా వ్యాపారాలున్నాయి. అలాగనీ అధికారాన్ని ఆశించకుండా ఉండలేదు కదా. అలాగే షర్మిల కూడా ఆశిస్తారు. అందులో తప్పులేదు. రాజకీయంగా శత్రువులు పెంచుకున్నా ఓకే కానీ కుటుంబంలో పెంచుకోకూడదు. కానీ జగన్ అదే చేసి దెబ్బైపోయారు. మొత్తానికి తెలంగాణలో పార్టీ పెట్టి విఫలమైన షర్మిలను కాంగ్రెస్ పార్టీ ఏపీలో చక్కగా వినియోగించుకుంటోంది. జగన్ కేరెక్టర్‌ను జనాలకు చూపించాలన్నదే లక్ష్యంగా ఆమె పావులు కదుపుతున్నారు. నిజానికి జగన్ ఇంత లోతుగా ఆలోచించి ఉండకపోవచ్చు. ఆమె తెలంగాణకే పరిమితమవుతారని అనుకుని ఉండొచ్చు. అదే జగన్ చేసిన పెద్ద తప్పిదం. జగన్‌ను ఇతర రాజకీయ పార్టీల నాయకులో.. అధినేతలో తిట్టడం వేరు.. షర్మిల తిట్టడం వేరు. ముందే ఎంతో కొంత డబ్బిచ్చి షర్మిలతో సెటిల్ చేసుకుని ఉండి ఉంటే జగన్‌కు ఇంత తలకాయనొప్పి ఉండేది కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.