ఈసారి కూడా వైసీపీ వస్తే.. జగన్మోహన్‌రెడ్డి అరాచకాలకు అడ్డుకట్ట వేయడం అసాధ్యమని భావించిన టీడీపీ, జనసేనలు పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే తమ పార్టీల కార్యకర్తలకు సైతం ఒకరికొకరు సహకరించుకోవాలంటూ దిశా నిర్దేశం చేశాయి. టీడీపీతో పాటు ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు సుదీర్ఘ అనుభవం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ కేడర్‌కు చెప్పారు. అంతేకాకుండా టీడీపీ కేడర్‌ను జనసైనికులు చిన్నచూపు చూడొద్దని కలిసి మెలిసి పని చేయాలంటూ దిశా నిర్దేశం కూడా చేయడం జరిగింది. ఇదే క్రమంలో చంద్రబాబు కూడా జనసేనకు గౌరవం ఇస్తూ వస్తున్నారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచారన్న భావన కూడా ఆయనలో ఉంది.
వైసీపీ గెలుపు కోసం పరోక్షంగా సహకారం..
ఇక ఇరు పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు సిద్ధమయ్యాయి. అయితే పొత్తు ధర్మాన్ని విస్మరించి చంద్రబాబు ‘రా.. కదలిరా’ సభల్లో భాగంగా రెండు టీడీపీ స్థానాలను ప్రకటించడం తప్పిదమే. దీనిని ఖండిస్తూ రిపబ్లిక్ డే సందర్భంగా జనసేనాని సైతం రాజానగరం, రాజోలు స్థానాలను ప్రకటించారు. అంతటితో మేటర్ ఓవర్. ఇక ఇక్కడి నుంచి టీడీపీ వర్సెస్ జనసేన కేడర్ మధ్య గలాటా ప్రారంభమైంది. ఒకరినొకరు విమర్శలు చేసుకుంటూ వైసీపీ గెలుపు కోసం పరోక్షంగా తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. వైసీపీని గద్దె దింపడమే లక్ష్యమన్న మాట మరిచి తమ పార్టీని అధికారంలోకి రాకుండా చూసేందుకు పరోక్షంగా తెగ శ్రమిస్తున్నారు.
టికెట్ దక్కకుంటే ఇంత దారుణమా?
రాజమండ్రి కాతేరులో టీడీపీ నిర్వహిస్తున్న రా కదలిరా కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత పార్టీ నేతల నుంచే ముప్పు తప్పింది. జనసేన రాజానగరం టికెట్‌ను ప్రకటించడం అక్కడి టీడీపీలో కల్లోలం రేపింది. రాజానగరం టీడీపీ టికెట్ ఆశించిన బొడ్డు వెంకటరమణ వర్గీయులు ఆందోళనకు దిగారు. కార్యక్రమం ముగించుకుని స్టేజి దిగుతున్న చంద్రబాబుని బొడ్డు వర్గీయులు అడ్డుకోవడంతో అక్కడ తోపులాట జరిగింది. చంద్రబాబు స్టేజిపై నుంచి కిందపడబోగా సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. ఇలా అధినేతపైనే తిరుగుబాటుకు యత్నించడం చర్చనీయాంశంగా మారింది. టికెట్ దక్కకుంటే ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? ఇలాంటి నేతలందరూ చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు సైలెంట్‌గా ఉండిపోయినవారే కావడం గమనార్హం. ఇలాంటి చర్యలు పార్టీ గెలుపుకన్నా.. పతనానికే ఎక్కువగా దారి తీస్తాయని తెలుసుకుంటే మంచిది. మనస్పర్థలు వచ్చినప్పుడు అధినాయకత్వంతో సంప్రదించి మాట్లాడుకోవాలి తప్ప ఇలాంటి అల్లర్లతో సాధించేదేమీ ఉండదని కేడర్ తెలుసుకోవాలి.