2024 సంక్రాంతి బరిలో నిలిచేందుకు ఐదు చిత్రాలు రెడీ అవ్వగా.. ఆఖరి నిమిషంలో రవితేజ ఈగల్ సినిమాని వాయిదా వేశారు. వాస్తవానికి సంక్రాంతికి పర్ఫెక్ట్‌గా సిద్ధమైన చిత్రం ఈగల్. కానీ ఆ సినిమానే వాయిదా వేయించారు. అసలు సంక్రాంతికి వస్తాయా? రావా? అనే డౌట్‌లో ఉన్న సినిమాలు గుంటూరు కారం, నా సామిరంగ. ఈ రెండు సినిమాలు చివరి వరకు కన్ఫ్యూజన్‌నే కొనసాగించాయి. అందుకు కారణాలు అనేకం. ఇక హను-మాన్, సైంధవ్ సంగతి సరేసరి. రెండు మూడు సార్లు విడుదల వాయిదా పడి మరి సంక్రాంతికి వచ్చాయి. మొత్తానికి చూస్తే.. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల విషయంలో సినిమా ఇండస్ట్రీ కూడా కన్ఫ్యూజన్‌కి గురైంది. అందుకేనేమో.. రాబోయే సంక్రాంతికి కింగ్ ముందే ఖర్చీఫ్ వేసేస్తున్నాడు.
రీసెంట్‌గా జరిగిన నా సామిరంగ సినిమా సక్సెస్‌మీట్‌లో కింగ్ నాగార్జున.. సీ యూ నెక్ట్స్ సంక్రాంతి అని చెప్పి.. వచ్చే సంక్రాంతికి కూడా తన సినిమా ఉన్నట్లుగా హింట్ ఇచ్చేశాడు. సో.. నాగ్ హింట్‌తో సంక్రాంతికి ఒక సినిమా సిద్ధమైనట్టే. మరో వైపు రాబోయే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, వశిష్టల కాంబోలో తెరకెక్కుతోన్న విశ్వంభర విడుదలను కన్ఫర్మ్ చేశారు. అలాగే ఈ సంక్రాంతికి వచ్చిన హను-మాన్ చరిత్ర సృష్టించి.. రాబోయే సంక్రాంతికి జైహనుమాన్‌తో మరోసారి దానిని తిరగరాసేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. అంటే మూడు సినిమాలు నెక్ట్స్ సంక్రాంతికి అడ్వాన్స్‌గా సీట్ బుక్ చేసి పెట్టుకున్నట్టే.
ఈ మూడు కాకుండా.. బాలయ్య, పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి వారు కనుక బరిలో దిగేందుకు సిద్ధమైతే.. పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది. ఏపీ ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ నటుడిగా బిజీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న రెండు సినిమాలు 50 శాతంకి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుని ఉన్నాయి. బాలయ్య కూడా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అది త్వరగా రెడీ అయ్యి ఈ సంవత్సరంలో వస్తే ఓకే కానీ.. లేదంటే మాత్రం సంక్రాంతికే రావాలని బాలయ్య పట్టుబడతాడు. ప్రభాస్ ది రాజా సాబ్ ఎప్పుడనేది ఇంకా క్లారిటీ లేదు. మరో వైపు దిల్ రాజు శతమానం భవతి సీక్వెల్ సంక్రాంతికే అంటూ అనౌన్స్ చేసి ఉన్నాడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గడు. చూస్తుంటే రాబోయే సంక్రాంతికి కూడా ఓ ఐదారు సినిమాలు రెడీ అయ్యే అవకాశం ఉంది.. కాబట్టి, చివరి నిమిషంలో కాకుండా ఇప్పటి నుండే పంచాయితీ పెట్టే పెద్దలు అలెర్ట్ అయితే బెటర్.