ఏపీ సీఎం జగన్‌పై చెల్లెలు, కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల నిరసన గళం వినిపిస్తున్నారు. ఆయనకు ఊపిరి సలపకుండా మాటలతో షర్మిల లాక్ చేసి పడేస్తున్నారు. ఏం చేయాలో పాలుపోక జగన్ నానా తంటాలు పడుతున్నారని టాక్. తన సొంత మీడియాకు కొందరు నాయకుల్ని పిలిపించి మరీ విమర్శలు చేస్తున్నా కూడా అవి వైసీపీకే ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఈ తరుణంలో ఎలాగైనా మాతృమూర్తి విజయమ్మ చేత షర్మిలను లాక్ చేయించాలని జగన్ యత్నిస్తున్నట్టు టాక్. జగన్ ప్రయత్నాలు ఆ దిశగా కొనసాగుతుండగానే ఏపీలో మరో హఠాత్పరిణామం చోటు చేసుకుంది. ఇది నిజానికి జగన్‌ను నిద్ర కూడా పోనివ్వదేమో..
అసలేం జరిగిందంటే..
తండ్రి వైఎస్ వివేకాను సోదరుడి కుటుంబమే కడతేర్చిందంటూ సునీతా రెడ్డి న్యాయపోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అన్న కారణంగా తనకు జరిగిన అన్యాయాన్ని చెబుతూ వైఎస్ షర్మిల తనకు రాష్ట్ర బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసం ఏపీలో పోరాడుతున్నారు. ఇంచుమించు వీరిద్దరూ ఒకరి కారణంగా బాధింపబడినవారే. అయితే తాజాగా వీరిద్దరూ కడపలో కలిశారు. ఇడుపులపాయ గెస్ట్ హౌస్‌లో వీరిద్దరూ సుదీర్ఘ మంతనాలు జరిపారు. సుమారు మూడు గంటల పాటు వీరిద్దరి మధ్య జరిగిన చర్చల్లో తాజా రాజకీయ పరిణామాలు సైతం చర్చకు వచ్చినట్టు టాక్. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఇద్దరూ నివాళులు సైతం అర్పించారు.
కడప నుంచి సౌభాగ్యమ్మ పోటీ?
అసలే షర్మిల దూకుడుకు కళ్లెం వేయలేక మూలిగే నక్క మాదిరి తయారైంది పరిస్థితి. ఇది చాలదన్నట్టుగా.. ఇద్దరు సోదరీమణులు షర్మిలారెడ్డి, సునీతారెడ్డిల భేటీ జగన్‌ను మరింత కలవర పెట్టడం ఖాయం. వీరిద్దరి భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. హాట్ టాపిక్‌గా మారింది. కడప లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మను పోటీ చేయించాలని షర్మిల భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ భేటీ అయ్యారో.. మరో కారణం ఏమైనా ఉందో తెలియదు కానీ.. ఏపీలో మాత్రం వీరి భేటీ చర్చనీయాంశంగా మారింది. ఒకరిని ఎదుర్కోవడమే జగన్‌కు కష్టంగా ఉంటే ఇక షర్మిలకు సునీత కూడా తోడైతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది.