ఏ రంగంలోనైనా అసాధారణమైన విశిష్ట సేవ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులు పద్మ అవార్డులు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రకటించిన పద్మ పురస్కారాలలో తెలుగు నుండి మెగాస్టార్ చిరంజీవితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని పద్మ విభూషన్ పురస్కారం వరించింది. మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టి ఎంతోమందికి బ్లడ్ సహాయం చేస్తున్నారు. అలాగే కరోనా టైమ్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న కార్మికులకు సిసిసి ద్వారా నిత్యావసర సరుకులు, ఆ తర్వాత ఆక్సిజన్ సిలిండర్లు.. ఇలా ఒక్కటేమిటి? ఇండస్ట్రీలో ఏ ఆపద వచ్చినా నేనున్నానని ఫస్ట్ స్పందించే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయనకి ఈ అవార్డు రావడం పట్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వంగా ఫీలవుతోంది.
మెగాస్టార్‌కి ఈ పురస్కార ప్రకటన వచ్చినప్పటి నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులెందరో ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా చిరంజీవిని కలిసి అభినందనలు తెలిపారు. ఆ తర్వాత వరసగా ఇండస్ట్రీ నుండి ఒక్కొక్కరుగా మెగాస్టార్‌కు అభినందనలు తెలుపుతూనే ఉన్నారు. తాజాగా భారత క్రికెటర్ మెగాస్టార్‌కు అభినందనలు తెలపడం విశిష్టతను సంతరించుకుంది. వాస్తవానికి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూడా మెగాస్టార్‌కి స్నేహితుడే. కానీ యంగ్ క్రికెటర్ అయిన శ్రీకర్ భరత్ మెగాస్టార్‌ని కలిసి పద్మ విభూషణ్ పురస్కారం వచ్చినందుకు అభినందనలు తెలపడంతో.. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది.
శ్రీకర్ భరత్ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ క్రికెట్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఓడినప్పటికీ, కీపర్‌బ్యాట్స్‌మెన్‌గా తన ప్రతిభను కనబరిచాడు. కోన శ్రీకర్ భరత్ విశాఖపట్టణానికి చెందిన వ్యక్తి కావడంతో పాటు మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని కూడా. అందుకే మెగాస్టార్‌ని కలిసి తన ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.