తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పాలన అంతా చక్కగానే సాగుతోంది. అయితే వివాదాలకు దూరంగా ఉంటారనుకున్న సీఎం రేవంత్ రెడ్డికీ వివాదాలు తప్పడం లేదు. బీఆర్ఎస్ హయాంలో టీఎస్‌పీఎస్సీలో ఎన్ని అవకతవకలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడా ట్రాన్స్‌పరెన్సీ అన్న మాటే లేకుండా పోయింది. పరీక్షలకు పరీక్షలే రద్దయ్యాయి. చాలా మంది అభ్యర్థులకు అన్యాయం జరిగింది. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత నిరుద్యోగుల్లో వచ్చేసింది. బీఆర్ఎస్ ఓటమికి ఇది కూడా ఓ కారణమైంది. ఇక టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తామంటూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
మహేందర్‌రెడ్డికి బాధ్యతలు..
ఇక ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన ప్రారంభించింది. పదవీ విరమణ తర్వాత కూడా విధుల్లో ఉన్న ఉద్యోగులను రిపోర్ట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డికి బోర్డు బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలోనే భారీగా ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు కూడా చకచకా జరిగిపోయాయి. ఆ తరువాత టీఎస్‌పీఎస్సీ సభ్యుల నియామకమూ జరిగిపోయింది. అంతా బాగానే ఉంది కానీ చిన్న పొరపాటో లేదంటే కావాలనే చేశారో కానీ ఇప్పుడో వ్యవహారం కొత్త చర్చకు కారణమవుతోంది.
తిరస్కరించిన అప్పటి కేసీఆర్ ప్రభుత్వం..
అదేంటంటే.. టీఎస్పీఎస్సీ బోర్డులో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తికి చోటు కల్పించడం. ఏపీకి చెందిన యరబాడి రామ్మోహన్ రావు అనే వ్యక్తికి.. టీఎస్‌పీఎస్‌సీ బోర్డులో తెలంగాణ ప్రభుత్వం చోటు కల్పించింది. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన రామ్మోహన్‌రావు అప్పట్లో ఉద్యోగుల విభజన సమయంలో.. తెలంగాణ ఆప్షన్ ఎంచుకున్నారు. అప్పట్లో మొత్తంగా 214 మంది తెలంగాణ ఆప్షన్ ఎంచుకోగా.. వారిలో రామ్మోహన్ రావు ఒకరు. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రామ్మోహన్‌ను తిరస్కరించి పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ మధ్యే ఆయన టీఎస్ జెన్‌కోలో ఈడీగా పోస్టింగ్ తీసుకున్నారు. ఇంతలోనే ఆయనకు టీఎస్‌పీఎస్సీలో పోస్టింగ్ లభించింది. ఏప్రిల్‌లో పదవీ విరమణ కావాల్సిన ఆయనను.. టీఎస్పీఎస్సీ బోర్డులో సభ్యుడిగా నియమించడం వెనుక ఎవరి హస్తమైనా ఉందా? అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది.